ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పనితీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. మెక్సికో, కెనడాతో పాటు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు యూఎస్‌ఏ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనాపై స్పెయిన్‌ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను గియాని ఇన్‌ఫాంటినోతో పాటు ట్రంప్‌ ప్రత్యక్షంగా వీక్షించారు.

ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో గియాని ఇన్‌ఫాంటినో అద్భుతంగా పనిచేశారని ట్రంప్‌ అభినందించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు ‘ప్రమోషన్‌’ ఇవ్వాలన్న ఆలోచనలో ట్రంప్‌ ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి కీలక వ్యాఖ్యలు చేశారు.

జంపోలి ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గియాని ఇన్‌ఫాంటినో గౌరవం సంపాదించుకున్న నాయకుడిగా ఎదిగారు. ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చే సామర్థ్యం ఆయనకు ఉందని జంపోలి అభిప్రాయపడ్డారు. 211 మంది సభ్యులతో కూడిన ఫిఫాను ఇన్‌ఫాంటినో సమర్థవంతంగా నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

“193 దేశాల సమాఖ్య అయిన ఐక్యరాజ్య సమితిని నడిపించే బాధ్యతను గియానికి అప్పగించాలనే గొప్ప ఆలోచన ట్రంప్‌కు వచ్చింది. గియానికి యూఎన్‌ జనరల్‌ సెక్రటరీ పోస్టు ఇవ్వాలనేది ట్రంప్‌ అభిమతం” అని జంపోలి వెల్లడించారు.

ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా ఉన్న గియాని ఇన్‌ఫాంటినోకు సంవత్సరానికి దాదాపు 6 మిలియన్‌ డాలర్ల ఆదాయం (సుమారు రూ.58 కోట్లు) వస్తోంది. అయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తే వార్షిక వేతనం 4.18 లక్షల డాలర్లు (సుమారు రూ.4 కోట్లు) మాత్రమే ఉంటుంది.

ప్రస్తుత ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వరకూ కొనసాగుతుంది. కొత్తగా పోటీపడాలనుకునే అభ్యర్థులు 15 మంది సభ్యులతో కూడిన యూఎన్‌ భద్రతామండలి మద్దతు సంపాదించుకోవాలి. అలాగే ఐదు శాశ్వత సభ్య దేశాలైన యూఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్‌, రష్యా, చైనా నుంచి వీటోను తప్పించుకోవాల్సి ఉంటుంది.

ప్రాంతాల వారీ రొటేషన్‌ విధానం కూడా ఐరాస చీఫ్‌ ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే యూఎన్‌ ప్రధాన కార్యదర్శి లాటిన్‌ అమెరికా లేదా కరీబియన్‌ ప్రాంతం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గియాని ఇన్‌ఫాంటినో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అడ్మినిస్ట్రేటర్‌ కావడం ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు ట్రంప్‌ ప్రతిపాదనకు యూఎన్‌లోని సభ్య దేశాల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఫిఫా అధ్యక్షుడిని ఐరాస ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాదించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.