చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్‌ ఉన్నతి హుడా ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె కొరియా క్రీడాకారిణి కిమ్‌ గయిన్‌ చేతిలో పరాజయం పాలైంది.

ఉన్నతి 10-21, 18-21 స్కోర్లతో కిమ్‌ గయిన్‌కు ఓటమి చవిచూసింది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే ఉన్నతి ఆటలో తడబాటు కనిపించింది. విరామ సమయానికి 3-11తో వెనుకబడిన భారత క్రీడాకారిణి తర్వాత కూడా తన ఆటను మెరుగుపరుచుకోలేకపోయింది. వరుస అనవసర తప్పిదాలతో తొలి గేమ్‌ను సులభంగా ప్రత్యర్థికి అప్పగించింది.

రెండో గేమ్‌లో ఉన్నతి కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మధ్య దశలో 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచి కిమ్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనితో ఆట హోరాహోరీగా సాగింది. ఒక దశలో స్కోరు 18-18తో సమంగా నిలిచింది. అయితే కీలక సమయంలో ఉన్నతి నుంచి మళ్లీ పొరపాట్లు రావడంతో ఆ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కోల్పోయింది.

పురుషుల డబుల్స్‌లో కూడా భారత జంట అర్జున్‌–హరిహరన్‌ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. చెన్‌ యంగ్‌–లూ యీ (చైనా) జంటతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 8-11తో వెనుకబడిన సమయంలో అర్జున్‌–హరిహరన్‌ గాయ సమస్యల కారణంగా మధ్యలోనే మ్యాచ్‌ను వదిలేశారు. దీంతో చైనా జంటకు విజయం దక్కింది.

ఈ టోర్నమెంట్‌లో భారత ఆశలు ఇప్పుడు ప్రధానంగా స్టార్‌ షట్లర్లపై నిలిచాయి. బుధవారం లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ తమ తమ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు. వీరి ప్రదర్శనపై భారత అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది.