ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అదిరిపోయే విజయాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన వెస్టిండీస్‌ (West Indies) జట్టు ప్రభ గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గిపోతోంది. వన్డే ఫార్మాట్‌లో ఈ జట్టు స్థాయి రోజురోజుకూ పడిపోతుండటంతో, వరుసగా రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.

గత వన్డే వరల్డ్‌కప్‌కి వెస్టిండీస్‌ నేరుగా అర్హత పొందలేక, క్వాలిఫయర్స్‌ ద్వారా టోర్నీలోకి రావాల్సి వచ్చింది. అయితే అక్కడ కూడా పేలవ ప్రదర్శనతో ప్రధాన టోర్నీకి దూరమైంది. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్‌కప్‌ విషయంలో కూడా అదే పరిస్థితి మళ్లీ ఎదురవుతోంది.

ఐసీసీ నిర్ణయించిన వన్డే ర్యాంకింగ్స్‌ ఆధారంగా నేరుగా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది. ఈ కటాఫ్‌ తేదీ నాటికి టాప్‌–8లో నిలిచిన జట్లు ఆటోమేటిక్‌గా టోర్నీకి అర్హత పొందుతాయి. ఆతిథ్య దేశాలైన సౌత్ ఆఫ్రికా , జింబాబ్వే లకు కూడా అర్హత ఉంటుంది.

సోమవారం ఐర్లాండ్ పై జరిగిన మూడో వన్డేలో ఆఫ్గనిస్తాన్ విజయం సాధించడం వెస్టిండీస్‌కి భారీ దెబ్బగా మారింది. ఆ విజయంతో ఆఫ్గనిస్తాన్ టాప్‌–8లోకి ఎగబాకి, 2027 వన్డే వరల్డ్‌కప్‌లో తన స్థానం ఖరారు చేసుకుంది. దీంతో వెస్ట్ ఇండీస్ ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి.

ప్రస్తుతం ఇండియా , న్యూ జేఅలాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా , పాకిస్తాన్ , శ్రీ లంక , ఇంగ్లాండ్ , ఆఫ్గనిస్తాన్ , బాంగ్లాదేశ్ , జింబాబ్వే జట్లు వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత పొందిన జట్ల జాబితాలో ఉన్నాయి. కటాఫ్‌ తేదీకి ముందు వెస్టిండీస్‌కి మిగిలి ఉన్న వన్డేలు రెండే. అవి కూడా సెప్టెంబర్‌లో ఇండియా తో జరగనున్నాయి.

ఆ రెండు మ్యాచ్‌ల్లో వెస్ట్ ఇండీస్ గెలిచినా ఆఫ్గనిస్తాన్ ను ర్యాంకింగ్స్‌లో వెనక్కి నెట్టే అవకాశం లేదు. అంటే, నేరుగా వరల్డ్‌కప్‌ బెర్తు దక్కే మార్గం పూర్తిగా మూసుకుపోయినట్టే.

ఇలాంటి పరిస్థితుల్లో 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలంటే వెస్ట్ ఇండీస్ తప్పనిసరిగా వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో పాల్గొనాలి. 10 జట్లతో జరిగే ఈ క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ తో పాటు క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ –2లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు, క్వాలిఫైయర్ ప్లే ఆల్ప్స్ నుంచి వచ్చే జట్లు పోటీపడతాయి.

ఈ టోర్నీలో వెస్ట్ ఇండీస్ విజేతగా నిలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో చోటు దక్కించుకుంటుంది. కానీ రెండో, మూడో, నాలుగో స్థానాల్లో ముగిస్తే సూపర్ సిరీస్ అనే అదనపు దశలో మళ్లీ పోటీపడాల్సి ఉంటుంది. ఆ సూపర్ సిరీస్ లో అగ్రస్థానం సాధించిన జట్టుకే వరల్డ్‌కప్‌లో చివరి బెర్తు లభిస్తుంది.

ఒకప్పుడు వరల్డ్‌కప్‌లలో రెండు సార్లు ట్రోఫీని ఎత్తుకున్న వెస్టిండీస్‌కి ఇప్పుడు క్వాలిఫయర్స్‌–సూపర్‌ సిరీస్‌ మార్గం తప్ప మరో దారి లేకపోవడం, ఈ జట్టు పడిపోతున్న స్థితిని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.