రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ ఫైనల్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశ చివరి రోజు కీలక విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఫైనల్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన వైజాగ్ ఫైర్‌బర్డ్స్ ముందుగానే ఫైనల్ పోటీలోనుంచి తప్పుకోగా, మిగతా మూడు జట్లలో ఏ రెండు ముందుకు వస్తాయన్న ఆసక్తి శుక్రవారం మ్యాచ్‌లతో ముగిసింది.
మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ ఫైర్‌బర్డ్స్‌పై గోదావరి గోల్డెన్ ఈగల్స్ 27 పరుగుల తేడాతో గెలిచి తొలి ఫైనల్ బెర్తును దక్కించుకుంది. అనంతరం సాయంత్రం జరిగిన కీలక పోరులో రాయలసీమ జెన్‌స్టార్స్ 32 పరుగుల తేడాతో అమరావతి ఈ ఛాంపియన్స్‌ను ఓడించి రెండో బెర్తును సొంతం చేసుకుంది. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన గోదావరి, రాయలసీమ జట్లు చెరో ఎనిమిది పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానాల్లో నిలిచాయి. అమరావతి ఈ ఛాంపియన్స్ ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయిన వైజాగ్ ఫైర్‌బర్డ్స్ రెండు పాయింట్లకే పరిమితమైంది.
డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ పోరులో విజేతగా నిలిచే జట్టు తొలి చాంపియన్‌గా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.
గెలుపు రుచి చూడకుండానే వైజాగ్ ప్రయాణం ముగింపు
డబ్ల్యూఏపీఎల్‌లో వైజాగ్ ఫైర్‌బర్డ్స్ జట్టు ఒక్క విజయమూ నమోదు చేయకుండానే తన ప్రయాణాన్ని ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ బౌలింగ్, బ్యాటింగ్ ధాటికి ఆ జట్టు నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గోదావరి 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసింది.
గోదావరి తరఫున పుష్పిత గౌడ్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసి వైజాగ్ బౌలర్లను చిత్తు చేసింది. కెప్టెన్ హెర్నీటా 34 పరుగులతో ఆమెకు మంచి తోడ్పాటు అందించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్‌బర్డ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. గోదావరి బౌలర్లలో శ్రేష్ఠి శేఖర్ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి పరుగుల వేగాన్ని కట్టడి చేసింది.
అమరావతి అదృష్టాన్ని వర్షం దెబ్బతీసింది

అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు డబ్ల్యూఏపీఎల్‌ను విజయవంతంగా ఆరంభించినప్పటికీ, చివరికి ఫైనల్ రేసులో వెనుకబడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి బలమైన జట్టుగా నిలిచిన అమరావతి, మూడో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. అనంతరం వర్షం కారణంగా వరుసగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడం ఆ జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
శుక్రవారం రాయలసీమ జెన్‌స్టార్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయలసీమ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పద్మజ 29 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. సేతు సాయి 31 పరుగులు, వాసవి పావని 29 పరుగులతో రాణించారు. అమరావతి బౌలర్లలో దేవిక 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి ఈ ఛాంపియన్స్ 19.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. కాట్రగడ్డ దీక్ష 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి పోరాడగా, దేవిక 26 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ అనూష 18 బంతుల్లో 26 పరుగులు చేశారు. అయితే రాయలసీమ బౌలర్ల దాడి ముందు అమరావతి బ్యాటర్లు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయారు. వాసవి పావని 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, పద్మజ, అనూష చెరో రెండు వికెట్లు తీసి అమరావతి ఆశలను పూర్తిగా చిదిమేశారు.







