అమరావతి: మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి సీజన్‌లో రాయలసీమ జెన్‌ స్టార్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాయలసీమ జట్టు గోదావరి జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన గోదావరి జట్టు రాయలసీమ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. ఆవుల శిరీష (4/19), ఎల్లుట్ల పద్మజ (2/18)లు క్రమంగా వికెట్లు తీయడంతో గోదావరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ హెర్నీటా ఫ్లెవియా పెరీరా (45; 44 బంతుల్లో 3×4), మహాలక్ష్మి మనోజ (20) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగలిగారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.

తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జట్టు ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సేతు సాయి (39; 40 బంతుల్లో 5×4), శుభశ్రీ (30; 35 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరి భాగస్వామ్యంతో రాయలసీమ విజయం వైపు దూసుకెళ్లింది. గోదావరి బౌలర్లలో శ్రేష్ఠి శేఖర్‌ 2 వికెట్లు తీసింది.

టోర్నీలో స్థిరమైన ప్రదర్శనతో ముందంజలో నిలిచిన రాయలసీమ జెన్‌ స్టార్స్‌ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. బౌలింగ్‌లో శిరీష, పద్మజలు చూపిన నైపుణ్యానికి బ్యాటింగ్‌లో సేతు సాయి, శుభశ్రీలు తోడు కావడంతో జట్టు విజయం సులభమైంది.

టైటిల్‌ గెలుచుకున్న రాయలసీమ జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. రన్నరప్‌ గోదావరి జట్టుకు రూ.8 లక్షలు అందజేశారు. మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌ విజయవంతంగా ముగియడంతో రాష్ట్ర మహిళా క్రికెట్‌ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందనే అభిప్రాయం క్రీడా వర్గాల్లో వ్యక్తమవుతోంది.