రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ కష్టపడి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అన్‌సీడెడ్ లొరెంజో సొనెగోతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఓటమి అంచుల వరకూ వెళ్లి చివరికి త్రుటిలో గెలుపును సొంతం చేసుకున్నాడు.
దాదాపు అయిదు గంటల పాటు సాగిన ఈ మారథాన్ పోరులో జ్వెరెవ్ 6-4, 3-6, 6-7 (7-9), 7-5, 6-4తో సొనెగోను ఓడించాడు. తొలి సెట్లో విజయం సాధించిన జ్వెరెవ్ తరువాతి రెండు సెట్లను కోల్పోయాడు. నాలుగో సెట్లో 4-5 వద్ద తన సర్వీస్ నిలబెట్టుకోవాల్సిన కీలక సమయంలో 30-30తో నిలిచినా, ఒత్తిడిని తట్టుకుని సర్వీస్‌ను కాపాడుకున్నాడు. వెంటనే 11వ గేమ్‌లో బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లి, సర్వీస్ నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు.
నిర్ణాయకమైన అయిదో సెట్లో అయిదో గేమ్‌లో బ్రేక్ సాధించిన జ్వెరెవ్ చివరి వరకు తన సర్వీస్‌ను కాపాడుకుని విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 12 ఏస్‌లు, 61 విన్నర్లు కొట్టగా, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం ద్వారా మ్యాచ్‌ను తన వైపు తిప్పుకున్నాడు. సొనెగో 43 అనవసర తప్పిదాలతో ఒత్తిడికి లోనయ్యాడు.
ఇతర పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లలో ఇటలీకి చెందిన కొబోలి, అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ శుభారంభం చేశారు. కొబోలి 3-6, 2-6, 6-3, 6-4, 6-4తో అర్జెంటీనా ఆటగాడు కొమేసనపై తిరిగి వచ్చి గెలిచాడు. ఫ్రిట్జ్ 6-3, 6-2, 6-4తో స్వదేశీ ఆటగాడు బ్లాంచ్‌ను ఓడించాడు.
13వ సీడ్ ముసెట్టి (ఫ్రాన్స్) 6-3, 6-3, 7-5తో ఫెరి (బ్రిటన్)పై, సెరుండొలో (అర్జెంటీనా) 6-4, 6-3, 7-5తో మిసోలిచ్ (ఆస్ట్రియా)పై, బెలుచి (ఇటలీ) 6-4, 6-2, 6-0తో పిరోస్ (హంగేరి)పై విజయం సాధించారు. అమెరికా ఆటగాడు నిశేష్ బసవారెడ్డి 6-7 (4-7), 6-3, 3-6, 4-6తో ఆస్ట్రేలియా ఆటగాడు షూల్‌కేట్ చేతిలో ఓటమి చవిచూశాడు.
అమెరికా ఆటగాడు మిచెల్సన్ రెండో రౌండ్‌లో 6-3, 6-4, 6-4తో నకషిమ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-1, 6-3, 7-5తో గోర్జ్‌ని (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ పెగులా (అమెరికా) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో ఆమె 6-3, 6-1తో కెనిన్ (అమెరికా)ను అలవోకగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో పెగులా 4 ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది.
రెండో సీడ్ రిబకినా (కజకిస్థాన్) తొలి రౌండ్‌లో 6-3, 6-2తో తెయా ఫ్రోడిన్ (అమెరికా)ను ఏకపక్షంగా ఓడించింది. 17 ఏళ్ల ఫ్రోడిన్ 2021లో విడుదలైన ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో సెరెనా పాత్రను పోషించిన డెమి సింగిల్టన్‌కు బాడీ డబుల్‌గా పనిచేసింది.
నాలుగో సీడ్ కొకో గాఫ్ (అమెరికా), అయిదో సీడ్ ఆండ్రీవా (రష్యా) రెండో రౌండ్‌లోకి చేరుకున్నారు. తొలి రౌండ్‌లో గాఫ్ 6-3, 6-4తో సోన్మెజ్ (తుర్కియే)పై, ఆండ్రీవా 6-2, 6-2తో టిజెన్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌లలో మ్యాడిసన్ కీస్ (అమెరికా) 7-5, 6-4తో కొర్నీవా (రష్యా)పై, పుతిన్‌త్సెవా (కజకిస్థాన్) 4-6, 7-5, 6-3తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, సకారి (ఇటలీ) 2-6, 7-5, 6-2తో మోంట్‌గోమరి (అమెరికా)పై, మెర్టెన్స్ (బెల్జియం) 6-4, 6-4తో క్యూవెదో (స్పెయిన్)పై గెలిచారు. టౌన్సెండ్ (అమెరికా), ష్నైడెర్ (రష్యా), పావోలిని (ఇటలీ) మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
వయస్సు 40 దాటినా గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) యుఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించాడు. జిమ్మీ కానర్స్ తర్వాత యుఎస్ ఓపెన్‌లో సింగిల్స్ మ్యాచ్ గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. సెప్టెంబరు 1న తన 40వ పుట్టినరోజు రోజున మోన్‌ఫిల్స్ 2-6, 6-1, 6-2, 6-0తో డేనియల్ వలెజో (పరాగ్వే)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. కానర్స్ కూడా 1992లో తన 40వ పుట్టినరోజు నాడు యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచాడు.
మోన్‌ఫిల్స్‌కు ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్. ఆటగాడిగా ఇదే తన చివరి సీజన్ అని అతడు ఇప్పటికే ప్రకటించాడు.







