రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూసే రోజులు పోయాయి. అక్కడ పని చేయాలని రాజకీయ నాయకుల వద్ద సిఫార్సు లేఖల కోసం తిరిగే పరిస్థితి ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘కూటమి’ నాయకుల ఒత్తిళ్లు, ఒంటెత్తు పోకడల గురించి ముందుగానే తెలుసుకున్న అధికారులు అక్కడికి రావడానికే వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి పోస్టింగ్ ఆఫర్ చేసినా “మాకొద్దు సార్” అంటూ చేతులెత్తేస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేయించుకునేందుకు కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో అరుదైన పరిపాలనా పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత ఐదు నెలలుగా ఇక్కడ ఇన్‌చార్జ్ ఆర్డీఓ, ఇన్‌చార్జ్ డీఎస్పీలతోనే వ్యవహారం నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటిగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన స్థానమైన పోలీస్ సబ్ డివిజన్‌కు ఐదు నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం.
పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ధర్మవరం ఇన్‌చార్జ్‌గా నియమించినా, రెండు సబ్ డివిజన్‌లను ఒకేసారి పర్యవేక్షించడం ఆయనకు కష్టసాధ్యమవుతోంది. ఈ కారణంగా కిందిస్థాయి పోలీసు సిబ్బందిపై పర్యవేక్షణ సక్రమంగా లేక, వ్యవస్థ ఇష్టారాజ్యంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ వంటి ఘటనలు చోటుచేసుకోవడం దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.
ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో కూడా పాలన దెబ్బతిన్నది. తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్‌ఐలు లేకపోవడంతో రెవెన్యూ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి వ్యవహారం నెట్టుకొస్తున్నారు. ఆమె అప్పుడప్పుడు మాత్రమే ధర్మవరం వచ్చి వెళ్లడం వల్ల రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని ప్రజలు చెబుతున్నారు.
భూముల రీ సర్వేలో సమస్యలు తలెత్తినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక రైతు సంఘాలు అంటున్నాయి. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికీ రేటు నిర్ణయించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు మరింత పెరిగాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటే చివరి మాటగా ఉండాలని ‘కూటమి’ పారీ్టలైన TDP, BJP, జనసేన ఇన్‌చార్జ్‌లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని స్థానిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలనే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు సమాచారం. TDP ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్‌చార్జ్ చిలకం మధుసూధన్‌రెడ్డి సైతం తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్‌ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.
అని ధర్మవరంవాసి గుండా ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది.
అని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి హెచ్చరించారు.













