రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు మళ్లీ కిలకిలారావాలతో మార్మోగుతున్నాయి. పుస్తకాల సంచులు భుజాలపై వేసుకుని, కొత్త ఉత్సాహంతో విద్యార్థులు బడుల బాట పట్టారు. కొన్ని వారాలుగా వెలవెలబోయిన పాఠశాల ప్రాంగణాలు మరోసారి విద్యార్థుల రాకతో చైతన్యాన్ని సంతరించుకున్నాయి.
2026–27 నూతన విద్యాసంవత్సరం అధికారికంగా ప్రారంభం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ సందడిమయంగా మారాయి. ఉదయం నుంచే పాఠశాలల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు రద్దీగా కనిపించారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తొలి రోజే పుస్తకాలను పంపిణీ చేస్తూ పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో మొత్తం 2,502 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలల్లో 1,85,547 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతానికి 1,84,526 మంది నమోదు అయ్యారు. ఈ నెలాఖరుకల్లా సుమారు 10 వేలమంది కొత్త విద్యార్థులు చేరే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనా వేస్తోంది. కొత్త విద్యాసంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు జిల్లాకు పెద్ద ఎత్తున చేరాయి.
జిల్లాకు ఇప్పటివరకు 10,07,776 పుస్తకాలు అందాయి. వీటిని పాఠశాలలకు పంపిణీ చేసి, తొలి రోజునుంచే విద్యార్థుల చేతికి అందజేస్తున్నారు. యూనిఫాం సరఫరా ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 మండలాలకు యూనిఫాం చేరగా, మిగిలిన మండలాలకు త్వరలో పంపిణీ చేయనున్నారు. పుస్తకాల బ్యాగులు ప్రస్తుతం వజ్రకరూరు మండలానికి మాత్రమే చేరగా, మిగిలిన మండలాలకు వారం రోజుల్లో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర విద్యాసామగ్రి మొత్తం పాఠశాలల్లో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు విధుల్లో చేరడంతో బోధనలో ఉన్న లోటు కొంతవరకు తీరిందని విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచేందుకు పలు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల హాజరు, బోధన ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా స్థాయి సమీక్షల్లో వెల్లడైంది.













