కదిరి:- వాల్మీకులను షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ జాబితాలోకి చేర్చే వరకు తమ పోరాటం ఆగదని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కదిరి మున్సిపల్‌ పరిధిలోని మాదవ గురుకులం పాఠశాల ఆవరణలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ సమావేశాన్ని వాల్మీకి సంఘం నాయకుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో, సంఘం నాయకుడు బూదిలి సుదర్శన్‌ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం సీనియర్‌ నాయకులు కొట్టాల శ్రీరాములు, కర్ణాటక రాష్ట్ర వాల్మీకి సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల హాజరయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులను షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లుగా గుర్తించగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వాల్మీకులను బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌గా వర్గీకరించడంతో ఈ వర్గం అన్ని విధాలా వెనుకబడిందని పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి వారం తహసీల్దార్‌, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను, డిమాండ్లను నిరంతరం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు నారాయణస్వామి, సోమశేఖర్‌, గోరంట్ల ఆదినారాయణ, అనిత, వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, ప్రసాద్‌, నాగరాజు, బొట్టుచంద్ర, మహేష్‌, కాళసముద్రం హరికృష్ణ, సురేష్‌, నరసింహులు, లోకేష్‌, జయసంహ, గోపాల్‌, మహిళా నాయకురాలు నాగేశ్వరి, సునంద వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమావేశంలో వాల్మీకుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై నాయకులు చర్చించారు. వాల్మీకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘం తరఫున చేపట్టాల్సిన చర్యలపై నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాల్మీకుల హక్కుల సాధన కోసం సంఘం ఐక్యంగా కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.