పుట్టపర్తి: రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, సాగునీటి, పారిశ్రామిక, ఉద్యానవన రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ జలకళతో కళకళలాడుతోందని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

సోమవారం పుట్టపర్తిలోని బుక్కపట్నం చెరువును ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలకే దక్కుతుందని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో అనేక ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, రాయలసీమలో చెరువులు, నదులు నీటితో నిండిపోవడం ప్రభుత్వం చేపట్టిన జలవనరుల అభివృద్ధి కార్యక్రమాల ఫలితమని ఆమె తెలిపారు.

కుప్పం నుంచి మడకశిర వరకు కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగునీటి పరిస్థితిని మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని మంత్రి సవిత పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి భవిష్యత్తుకు పోలవరం ప్రాజెక్టు కీలకమని, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాయలసీమలోని చివరి ఎకరా వరకు సాగునీరు అందుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తొలిసారిగా కృష్ణా జలాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు దక్కుతుందని ఆమె గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు. పులివెందులకు కూడా సాగు, తాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి సవిత పేర్కొన్నారు.

రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సుమారు రూ. లక్ష కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ప్రత్యేక రంగంలో అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

తిరుపతిలో రాయల్ ఎంఫిల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని, కర్నూలును డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు జొన్నగిరి ప్రాంతాన్ని స్వర్ణగిరిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ తో పాటు దాల్మియా సిమెంట్ విస్తరణ జరుగుతోందని, శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే Kia కార్ల పరిశ్రమతో పాటు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతోందని ఆమె పేర్కొన్నారు.

గత ఐదేళ్ల YSRCP ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి సవిత ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, శంకుస్థాపనలు, హడావుడి కార్యక్రమాలకే పరిమితమయ్యారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను YSRCP నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు, ఐదేళ్ల YSRCP పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి సవిత YSRCP నాయకులకు సవాల్ విసిరారు. ప్రజలే రెండు ప్రభుత్వాల పనితీరును పోల్చి తీర్పు చెబుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరెడ్డి, కూటమి నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవిత బుక్కపట్నం చెరువులో బోటు విహారం చేసి నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.