రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టంగా మారింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) రావడంతో ఉద్యోగులపై ఒత్తిడి మరింత పెరిగింది. జాబ్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు నేర్చుకోవడమే అసలైన విద్యగా భావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. పని ప్రదేశాల్లో ఏఐ టూల్స్ వినియోగం తప్పనిసరిగా మారిన ఈ సమయంలో, వాటిని ఎక్కడ, ఎంతవరకు వాడాలో తెలియకపోతే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఓ సర్వే ప్రకారం, భావోద్వేగ అవగాహన అవసరమైన పనులను 37 శాతం మంది ఉద్యోగులు ఏఐ టూల్స్‌తోనే పూర్తిచేస్తున్నట్లు తేలింది. అలాగే, రహస్యంగా ఉంచాల్సిన వర్క్‌ప్లేస్ కమ్యూనికేషన్ కోసం 35 శాతం మంది ఏఐ సహాయం తీసుకుంటున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. సోషల్ లేదా వ్యక్తిగత అనుబంధాల విషయంలో ఏఐని వాడే వారిని సహోద్యోగులు కొంత ప్రతికూలంగా చూస్తున్నారని, అలాంటి వారితో దూరంగా ఉండే ధోరణి కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా మూడు అంశాల్లో ఏఐ వాడకానికి ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వారు సూచిస్తున్నారు. ముందస్తు అనుమతి లేకుండా మీటింగుల్లో ఏఐ నోట్ మేకర్స్ లేదా ట్రాన్స్‌స్క్రిప్షన్ టూల్స్ వాడటాన్ని పెద్ద వర్క్‌ప్లేస్ తప్పిదంగా పరిగణిస్తున్నారు. ఆఫీసుల్లో ఫాథమ్ , ఓటర్ , గ్రానోలా వంటి ఏఐ అసిస్టెంట్ల వినియోగం పెరుగుతోందని, వీటి వల్ల సమావేశాల్లో సహజత్వం తగ్గి, సంభాషణలు యంత్రాల్లా అనిపిస్తున్నాయని ఓ కెరీర్ నిపుణుడు తన అనుభవాన్ని వివరించారు.

మీటింగుల్లో ఏఐ టూల్స్‌తో నిమిషాలు రికార్డు చేయాలన్నా, నోట్స్ తీసుకోవాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టూల్స్ వాడాల్సిన అవసరం ఉంటే, ముందుగా మానవీయ సంభాషణతో మీటింగ్‌ను ప్రారంభించి, తర్వాత అక్కడున్నవారి సమ్మతితో ఆటోమేటెడ్ విధానానికి మారడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
ఆఫీసుల్లో ప్రొఫెషనల్ పనులతో పాటు వ్యక్తిగత అనుబంధాలు కూడా కీలకం. ఇంటికంటే ఎక్కువ సమయం పని ప్రదేశంలోనే గడిపే పరిస్థితుల్లో తోటి ఉద్యోగుల మధ్య బంధం సహజంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కష్ట సమయంలో సహోద్యోగులకు ఏఐ టూల్స్ ద్వారా ఓదార్పు పంపడం కంటే, మనస్ఫూర్తిగా మన మాటలతో ధైర్యం చెప్పడం ఎక్కువ ఉపశమనాన్ని ఇస్తుందని వారు చెబుతున్నారు. ఏఐతో డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నా, పంపకుండా కొంతమేరకు మన మాటలు జోడించి, మార్పులు చేసి మెసేజ్ లేదా మెయిల్ పంపడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అవతలి వ్యక్తి పట్ల మన నిజమైన సానుకూల భావన ప్రతిబింబిస్తుందని నిపుణుల అభిప్రాయం.
సహోద్యోగులు, బాస్‌తో ఈమెయిళ్ల ద్వారా జరిగే సంభాషణల్లో కూడా కొందరు తమ పాండిత్యం చూపించాలనే ఉద్దేశంతో ఏఐ సాయం తీసుకుంటున్నారు. కఠినమైన పదాలు, క్లిష్టమైన వాక్య నిర్మాణం వాడితేనే తాము సమర్థులమనే భావనతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పనికి సంబంధించిన విషయాలు, పనితీరు, నిర్ణయాలు, కొత్త ఆలోచనల వంటి కీలక అంశాల్లో సాధ్యమైనంతవరకు సొంత తెలివినే ఉపయోగించడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఒకవేళ ఏఐ సాయం తీసుకున్నా, మెసేజ్ పంపే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యమైన పనుల్లో చిన్న పొరపాటు జరిగినా, పై అధికారులు లేదా యాజమాన్యం దాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నట్టు భావించే ప్రమాదం ఉంది. అలాంటి తప్పిదాలు కెరీర్‌లో ప్రమాద సంకేతాలుగా మిగిలిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐని ఎలా వాడాలో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఎక్కడ వాడకూడదో తెలుసుకోవడమే అసలు నైపుణ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టూల్స్ వినియోగంలో వర్క్‌ప్లేస్ ఎటికెట్ పాటిస్తే, ఎవరికీ వేలెత్తి చూపే అవకాశం ఉండదని వారు సూచిస్తున్నారు.






