వేరబుల్ గ్యాడ్జెట్‌ల విభాగంలో మరో కీలక ఉత్పత్తిగా శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్‌ నిలవబోతున్నాయి. జూలై 22న లండన్‌లో జరగనున్న గాలక్సీ Unpacked కార్యక్రమంలో ఈ కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను శాంసంగ్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే అధికారిక లాంచ్‌కు ముందే వీటి కంపానియన్ యాప్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో గ్లాసెస్ ప్రధాన ఫీచర్లు బయటకు వచ్చాయి.

లీక్ అయిన సమాచారం ప్రకారం గెలాక్సీ గ్లాసెస్‌లో గూగుల్ జెమినీ AI ఆధారిత అసిస్టెంట్, 12 మెగాపిక్సెల్ కెమెరా, నోటిఫికేషన్ రీడర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండానే ఫోటోలు, వీడియోలు తీయడం, నోటిఫికేషన్లు వినడం వంటి పనులు ఈ గ్లాసెస్ ద్వారా చేయగలిగేలా శాంసంగ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

SammyGuru అనే వెబ్‌సైట్ గాలక్సీ గ్లాస్సెస్ మేనేజర్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి, హోమ్ స్క్రీన్ స్క్రీన్‌షాట్లను విశ్లేషించింది. వాటి ద్వారా గ్లాసెస్ బ్యాటరీ శాతం, గ్లాసెస్‌తో తీసిన ఫోటోలను ఆటోమేటిక్‌గా ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసే ఆప్షన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ప్రధాన ఫీచర్లను ఆన్/ఆఫ్ చేయడానికి టోగుల్‌లు వంటి అంశాలు బయటపడ్డాయి.

కొత్తగా గ్లాసెస్ కొనుగోలు చేసిన తర్వాత ముక్కు భాగంలో ఉన్న రక్షణ ఫిల్మ్‌ను తొలగించి, ఎడమ వైపు ఉన్న పవర్ స్విచ్‌ను ఆన్ చేసి, ఛార్జింగ్ కేస్‌లో పెట్టి ఫోన్‌తో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చని యాప్‌లో సూచనలు ఉన్నట్లు సమాచారం. Warby పార్కర్ , Gentle మాన్స్టర్ వంటి బ్రాండ్లతో కలిసి శాంసంగ్ ఈ గ్లాసెస్‌ను తయారు చేస్తోంది.

లీక్ ప్రకారం గెలాక్సీ గ్లాసెస్‌లో నాలుగు ప్రధాన ఫీచర్లు ఉంటాయి. మొదటిది గూగుల్ జెమినీ ఆధారిత ఏఐ అసిస్టెంట్. రెండోది ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లను గట్టిగా చదివి వినిపించే ఫీచర్. మూడోది ఫైండ్ మై గ్లాస్సెస్ ఫీచర్ ద్వారా గ్లాసెస్‌ను ఫోన్ సహాయంతో గుర్తించగలగడం. నాలుగోది అడ్వాన్స్డ్ ఫీచర్స్ విభాగంలో 12MP కెమెరా, దీని ద్వారా గ్లాసెస్ నుంచే నేరుగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేయగలగడం.

ఈ గ్లాసెస్‌ను Samsung గాలక్సీ రింగ్ ద్వారా కూడా నియంత్రించగలమని లీక్‌లో వెల్లడైంది. చేతి వేళ్లతో చేసే సైగల ద్వారా గ్లాసెస్‌ను ఆపరేట్ చేయడానికి అవసరమైన కోడ్ లైన్లు యాప్‌లో ఉన్నాయని నిపుణులు గుర్తించారు. గాలక్సీ Ring‌ లో ఉన్న రిసీవర్ భాగం గ్లాసెస్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను స్వీకరిస్తుంది. అదనంగా గాలక్సీ వాచ్ ద్వారా కూడా గ్లాసెస్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక కంట్రోలర్ యాప్‌ను శాంసంగ్ అభివృద్ధి చేస్తోంది.

గెలాక్సీ గ్లాసెస్ వన్ UI XR ప్లాట్‌ఫామ్‌పై పనిచేయనున్నాయి. గూగుల్ , Samsung, Qualcomm కలిసి అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ XR ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ నడుస్తుంది. దీని వల్ల గూగుల్ మప్స్ , గూగుల్ సెర్చ్ , గూగుల్ Translate వంటి ఆండ్రాయిడ్ యాప్‌లతో గ్లాసెస్ డీప్ ఇంటిగ్రేషన్ పొందనున్నాయి. జెమినీ AI సాయంతో వాయిస్ నావిగేషన్, లైవ్ ట్రాన్స్‌లేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు హ్యాండ్స్-ఫ్రీగా ఉపయోగించగలుగుతారు.

గ్లాసెస్ బరువు తగ్గించేందుకు ప్రధాన ప్రాసెసింగ్ పనిని కనెక్ట్ అయిన స్మార్ట్‌ఫోన్ నిర్వహించేలా డిజైన్ చేశారు. వెలుతురు తీవ్రతకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా మారే ఫోటోక్రోమిక్ లెన్స్‌లను కూడా ఇందులో ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం స్మార్ట్ ఏఐ గ్లాసెస్ మార్కెట్‌లో మెటా రే - బాన్ గ్లాస్సెస్ సుమారు రూ.25,000 ధరతో ముందంజలో ఉన్నాయి. వీటికి పోటీగా రాబోతున్న Samsung గాలక్సీ గ్లాస్సెస్ ధర సుమారు రూ.31,000 నుంచి రూ.41,000 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెటా గ్లాసెస్‌తో పోలిస్తే ధర ఎక్కువైనా, జెమినీ AI ఇన్‌బిల్ట్‌గా ఉండటం, ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌తో డీప్ ఇంటిగ్రేషన్ ఉండటం శాంసంగ్‌కు అనుకూలంగా పనిచేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Samsung గాలక్సీ గ్లాస్సెస్ , మెటా రే - బాన్ గ్లాస్సెస్ రెండింటిలోనూ డిస్‌ప్లే ఉండదని, సాధారణ గ్లాసెస్‌లా కనిపిస్తాయని సమాచారం. డిస్‌ప్లే కలిగిన కొత్త వర్షన్‌ను 2027లో తీసుకురావాలని శాంసంగ్ ప్రణాళికలు చేస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. అదే సంవత్సరం ఆపిల్ కూడా తన AI గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావచ్చనే చర్చ నడుస్తోంది.

జూలై 22న జరగబోయే గాలక్సీ ఉంప్యాకెడ్ ఈవెంట్‌లో గెలాక్సీ గ్లాసెస్‌తో పాటు గాలక్సీ Z ఫోల్డ్ 8, Z ఫ్లిప్ 8, గాలక్సీ వాచ్ 9 వంటి పరికరాలను కూడా శాంసంగ్ పరిచయం చేయనుంది.