కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్న ఫ్యూచర్ సిటీలో కీలక మైలురాయి నమోదైంది. ఫ్యూచర్ సిటీకి ప్రతీకగా నిలవనున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని (FCDA) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సీఎం రిబ్బన్ కట్ చేసి ఎఫ్సీడీఏ ఆఫీస్‌ను ప్రారంభించారు.

ఫ్యూచర్ సిటీ రూపకల్పనలో భాగంగా నిర్మించిన ఈ ఎఫ్సీడీఏ భవనం, పర్యావరణహిత నిర్మాణ శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భవనం నిర్మాణంలో సస్టైనబుల్ డిజైన్ సూత్రాలను అనుసరించారు. పైకప్పు మొత్తం ఫోటో వోల్టాయిక్ షేడ్స్‌తో కప్పి, సౌర శక్తిని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, భవనం లోపల సహజ చల్లదనాన్ని కల్పించేలా డిజైన్ చేశారు.

భవనం పైకప్పుపై గ్రీన్ రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు చేయనున్నారు. నీటి పునర్వినియోగం కోసం ప్రత్యేక ఎకో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను రీచార్జ్ చేసే వ్యవస్థను అమలు చేస్తున్నారు. అలాగే, వ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు వినియోగించే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ చర్యలు మొత్తం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా ఉంటాయని అధికారులు తెలిపారు.

భవనం చుట్టూ ల్యాండ్ స్కేపింగ్‌లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ఎయిర్ క్వాలిటీ మెరుగుపరచడానికి బయోఫిలిక్ డిజైన్‌ను అనుసరించి, భవనం లోపలి భాగాల్లో కూడా పచ్చదనాన్ని సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించారు.

ఎఫ్సీడీఏ భవనానికి గాజు ఫ్యాకేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, సహజ కాంతి లోపలికి వచ్చేలా, అలాగే లోపలి ఉష్ణోగ్రతను తగ్గించేలా రూపుదిద్దుకుంది. భవనం సమీపంలో ఏర్పాటు చేయనున్న కలెక్షన్ పాండ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, చుట్టుపక్కల ప్రాంతాల భూగర్భ జలాల స్థాయికి కూడా మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తం మీద టెక్నాలజీ, ప్రకృతిని మేళవించి నిర్మిస్తున్న ఈ ఎఫ్సీడీఏ భవనం ఫ్యూచర్ సిటీకి గ్రీన్ సింబల్‌గా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా, భవిష్యత్తులో తెలంగాణకు వచ్చే పారిశ్రామిక పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయం నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రపంచస్థాయి సంస్థలు ఫ్యూచర్ సిటీలోకి వచ్చినప్పుడు, హైదరాబాద్ నగర వైభవం ప్రతిబింబించేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్సీడీఏ భవనం ఫ్యూచర్ సిటీ విజన్ అమలులో తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇది కేవలం కార్యాలయంగా మాత్రమే కాకుండా, నాలెడ్జ్ హబ్‌గా కూడా సేవలందించనుంది.

ఐటీ, ఫార్మా, ఇతర రంగాల ప్రతినిధులతో చర్చలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆధునిక సదుపాయాలతో కూడిన కాన్ఫరెన్స్ హాల్స్‌ను ఈ భవనంలో ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు, ప్రణాళికలు ఈ ఎఫ్సీడీఏ కార్యాలయం నుంచే ముందుకు సాగనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.