తెలంగాణలో భారీ వర్షాలు

పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేయడంతో పగటి వేళల్లోనే చీకట్లు కమ్ముకున్నట్లు అనిపించింది.

హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. రహదారులపై నీరు నిల్వ ఉండటం, ట్రాఫిక్‌ నెమ్మదించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. హైదరాబాద్‌, ఖమ్మం, మెదక్‌, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సిద్ధిపేట్‌, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో వర్షాల తీవ్రతను బట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు.

రాబోయే రోజుల్లో వర్షాల పరిస్థితిపై హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి శ్రావణి వివరాలు వెల్లడించారు. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ముఖ్యంగా రైతులు వర్షాల పరిస్థితిని గమనించి వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. రైతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని శ్రావణి పేర్కొన్నారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయడం మంచిదని ఆమె సూచించారు. ఇలా చేయడం వల్ల విత్తనాల నష్టం తగ్గి, పంటలు సకాలంలో పెరుగుతాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది.

హైదరాబాద్‌లో 17, 18 తేదీల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రెండు రోజుల్లో నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల్లో ఎల్‌నినో ప్రభావం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో కారణంగా చలికాలంలో సాధారణం కంటే ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఎండాకాలంలో ఉండాల్సిన వేడి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశ్లేషణలో వెల్లడించింది.