రాయలసీమ న్యూస్, వెదర్ డెస్క్:
హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో జలమయం
హైదరాబాద్ : నగరంలో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షం నమోదైంది. కొద్ది సేపు కురిసిన ఈ వర్షంతో అక్కడి రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఎండలో ప్రయాణిస్తున్న వాహనదారులు, బయట ఉన్న ప్రజలు ఈ ఆకస్మిక వర్షాన్ని ఆస్వాదించారు. చిరుజల్లుల్లో తడుస్తూ చాలామంది సేదతీరారు.
ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండటంతో నగర వాసులు ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారి మబ్బులు కమ్ముకోవడంతో కొద్దిసేపట్లోనే వర్షం ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో గాలులు కూడా వీచాయి. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ మందగించింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణతో పాటు దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాల నేపథ్యంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల సమయంలో ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు వర్షాల సమాచారం, హెచ్చరికలను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.







