హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా పర్యవేక్షణపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడానికే పరిమితం కాకుండా, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ బ్యూరో సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి స్థాయి అధ్యయనంతో రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో వాతావరణ మార్పులు, వివిధ వర్గాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల అమలుపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో సిగ్నల్స్ వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా, నిరంతర వాహన రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అమలు చేయడానికి అవసరమైన కీలక ప్రాంతాల్లో అండర్ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో నగరంలో కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే ముందు, ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన ముందస్తు అధ్యయనం తప్పనిసరిగా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.