కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ ఘటన కలకలం రేపింది. రెండు నెలల క్రితం పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన దోపిడీ కేసు మర్చిపోకముందే, అదే తరహాలో ఇప్పుడు ఓ ఇంట్లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. భగత్‌నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారం, నగదు, వెండి లాంటి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

భగత్‌సింగ్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తులో అజ్మత్ అలీ కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. రాత్రి పడుకునే ముందు అజ్మత్ అలీ గ్రౌండ్ ఫ్లోర్‌లోని లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్లేందుకు దిగుతుండగా, బయట మాటువేసి ఉన్న సుమారు ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు సమాచారం.

దుండగులు ముందుగా అతని నోరు మూసేసి అరవకుండా అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా ఇంట్లోకి లాగి తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అజ్మత్ అలీ తల, ముఖంపై గట్టిగా కొట్టి గాయపరిచారు. ఇంట్లో ఉన్న అతని భార్య, ఇద్దరు కుమార్తెలను కూడా తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించిన దుండగులు, కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు.

బాధితులను తీవ్రంగా కొట్టి, అనంతరం చేతులు కట్టేసి ఒక గదిలో బంధించారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి తీసుకెళ్లారు. దోపిడీ అనంతరం బాధితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు వారి మొబైల్ ఫోన్లను కూడా వెంట తీసుకెళ్లారు. వెళ్లే ముందు పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లను చోరీ చేసి, వాటిపై అక్కడి నుంచి పరారయ్యారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించి, నిందితుల గుర్తింపుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వేములవాడ బైపాస్ రోడ్ దిశగా నిందితులు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ దోపిడీకి తెలిసిన వ్యక్తులే పాల్పడి ఉంటారనే అనుమానాన్ని బాధితుడు అజ్మత్ అలీ వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా తన పెద్ద అల్లుడిపైనే అనుమానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇంటికి వచ్చిన ఎనిమిది మంది దుండగులు ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారిలా హిందీ భాషలో మాట్లాడారని, తన అల్లుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడని అజ్మత్ అలీ పేర్కొన్నాడు.

కరీంనగర్ పట్టణంలో వరుసగా జరుగుతున్న దోపిడీ ఘటనలు స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. నగరంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.