సంచలనం సృష్టించిన ‘ఫార్ములా-ఈ కార్‌ రేసు’ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఆయనకు న్యాయస్థానం రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి కూడా కోర్టులో పూచీకత్తు సమర్పించారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.

నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)’కు నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు జరిపి, మార్చి 23న 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 14 మంది సాక్షులను పేర్కొంటూ, కేటీఆర్‌తో సహా ఐదుగురిపై అభియోగాలు మోపింది. కోర్టు ఈ ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులు తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు.

ఏసీబీ అభియోగాలు:

క్యాబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. సంతకం చేసే అధికారం లేకపోయినా నిబంధనలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి హెచ్ఎండీఏ ద్వారా సుమారు రూ. 75.88 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం, ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరింది. రాబోయే సీజన్లకు గాను ప్రభుత్వంపై రూ. 600 కోట్ల భారం పడేలా ఒప్పందాలు చేశారు. దీనికి ప్రతిఫలంగా పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు అందాయి.

మాపై తప్పుడు కేసులు : కేటీఆర్

అయితే.. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి వేదికగా నిలపాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. రేసును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం వల్లే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. నిర్ణయాల్లో అధికారుల, నిపుణుల పాత్ర కూడా ఉంది. అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను నేరాలుగా చిత్రీకరిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై అక్రమ కేసులు బనాయించారు. కోర్టు విచారణకు ముందు కేటీఆర్ ఫేస్‌బుక్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కుట్రపూరితంగా బనాయించిన ఈ తప్పుడు కేసులు ప్రజల తరఫున మేం చేసే పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా సత్యమే గెలుస్తుంది’ అని స్పష్టం చేశారు.