రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సును సమీపంలోనే ఉండే బైక్ మెకానిక్ దారుణంగా హత్య చేసి, అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ నర్సు హత్యాచారం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి, నిందితుడు సనావుల్లా (34)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై హత్య, అత్యాచారం కేసులతో పాటు ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
సోమవారం శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బాధితురాలు (21) ఉపాధి కోసం ఏడాది క్రితం మహేశ్వరం వచ్చారు. సుమారు ఏడు నెలల క్రితం తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా చేరి, ఆసుపత్రికి సమీపంలోని అద్దె క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.
అదే ప్రాంతంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తూ, అక్కడే ఉంటున్న బిహార్‌కు చెందిన సనావుల్లా దృష్టి కొంతకాలంగా బాధిత నర్సుపై పడింది. గత నెల రోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ, ఆమె గది ఫొటోను తన ఫోన్‌లో కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని బాధితురాలు తన గదికి చేరుకున్నారు. అదే గదిలో ఉంటున్న మరో నర్సు ఆ రాత్రి డ్యూటీకి వెళ్లడంతో ఆమె ఒంటరిగా మిగిలారు. గది తలుపు మూసుకుని రాత్రి 11 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడి, అనంతరం నిద్రకు ఉపక్రమించారు. ఆ గదికి ఉన్న అల్యూమినియం కిటికీ తలుపులు సరిగా లేని విషయం నిందితుడి దృష్టికి వచ్చింది.
కిటికీ ద్వారా గదిలోని పరిస్థితిని గమనించిన సనావుల్లా అర్థరాత్రి వరకు మద్యం సేవిస్తూ, అశ్లీల చిత్రాలు చూశాడు. అనంతరం కిటికీ ద్వారా నర్సు గదిలోకి చొరబడి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. మేల్కొన్న బాధితురాలు కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించారు. ఆత్మరక్షణ కోసం గోర్లతో నిందితుడి గొంతు, ఛాతీపై గీతలు పెట్టి, ఎడమచేతి చిటికెన వేలిని కొరికారు. దీంతో ఆగ్రహంతో సనావుల్లా ఆమె ముఖంపై దాడి చేసి, కిందకు తోసి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
శనివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని వచ్చిన మరో నర్సు గది తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని, గదిలో బాధితురాలు నిర్జీవంగా పడి ఉండడాన్ని గుర్తించారు. ముఖం, కాళ్లపై గాయాలు ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పిన్ని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు ప్రారంభ దశలోనే పోలీసులు సమీపంలో ఉన్న బైక్ మెకానిక్ సనావుల్లాను ప్రశ్నించగా, అతడు మొదట తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. స్థానికులను విచారించగా, ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం కీలకమైంది. అర్థరాత్రి సమయంలో సనావుల్లా తనకు ఫోన్ చేసి పెట్రోల్ కావాలని అడిగినట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీనిపై సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, సనావుల్లా బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి గదికి వచ్చినట్లు గుర్తించారు.
అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు, ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, అందులో మృతురాలి గది ఫొటోతో పాటు అశ్లీల చిత్రాలను గుర్తించారు. తమదైన శైలిలో విచారణ జరిపిన అనంతరం సనావుల్లా నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా రుదౌలి గ్రామానికి చెందిన ఎండీ సనావుల్లా మూడు సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి కావడంతో డెలివరీ కోసం స్వగ్రామానికి పంపినట్లు దర్యాప్తులో తెలిసింది.
మృతురాలి అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలో నిర్వహించారు. అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ స్వయంగా పాడె మోసినట్లు స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.






