జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందడంతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో పక్కపక్క ఇళ్లలో నివసించే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

స్థానికుల కథనం ప్రకారం, ఒకే తరగతి అయిన యూకేజీ చదువుతూ, నిత్యం కలిసి మెలిసి ఆడుకునే స్నేహితులు హరిస్మిత (6), వరుణ్ తేజ (6)లు ఇటీవల విషజ్వరాల బారిన పడ్డారు. జ్వరం తీవ్రత పెరగడంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక, రెండు రోజుల క్రితం వరుణ్ తేజ మృతి చెందాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న హరిస్మిత నిన్న ఉదయం కన్నుమూసింది.

విషజ్వరాల కారణంగా కలిగిన తీవ్ర అస్వస్థత వల్లే ఈ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వరుసగా రెండు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పొరండ్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని అదనంగా మోహరించారు. గ్రామంలో విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ రోజు నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో గ్రామంలో సుమారు 20 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధితులకు అవసరమైన మందులు, చికిత్సను అందజేస్తున్నట్లు స్థానిక ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

గ్రామస్తులు ఎవరూ అధైర్యపడకూడదని, ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కొద్దిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి లేదా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వారు స్పష్టం చేశారు.

విషజ్వరాల మూలాలను గుర్తించి, నీటి వనరుల పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలను బలోపేతం చేయాలని అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.