రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ, మార్పుల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మహిళా ప్రతినిధిత్వం పెంపుపై హైకమాండ్ దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా కొండా సురేఖ స్థానంలో మరో మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొండా సురేఖపై వేటు వేయాలని నిర్ణయించడమే కాకుండా, ఒకేసారి ముగ్గురు మహిళలకు పదవులు కేటాయించే దిశగా వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కేబినెట్‌లో త్వరలోనే ప్రక్షాళన జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు ప్రస్తుత మంత్రులను తప్పించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం కలిగిన మహిళా నేత రాములమ్మగా పేరుగాంచిన విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన పార్టీ లోపల చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీగా ఉన్న విజయ శాంతిని కేబినెట్‌లోకి తీసుకుని రావాలని, ఆమె ప్రజాదరణను కాంగ్రెస్ బలోపేతానికి వినియోగించుకోవాలని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా కొండా సురేఖ పార్టీని వీడి భవిష్యత్తులో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందని, ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విజయశాంతి వంటి బలమైన మహిళా నాయకురాలిని ముందుకు తేవాలనే ఆలోచన పార్టీ వ్యూహకర్తలలో ఉన్నట్లు చెబుతున్నారు.
కొండా సురేఖపై వేటు అమలు, ఆమె స్థానంలో కొత్త మహిళా మంత్రికి అవకాశం కల్పించడం, మరోవైపు ముగ్గురు మహిళలకు పదవులు కేటాయించే ప్రయత్నాలు.. ఇవన్నీ కలిపి తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలకు కొత్త దిశను నిర్దేశించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేబినెట్ మార్పులపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది.







