తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేరేలా, నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ నిర్మాణం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంలో ఘనంగా నివాళులు అర్పించారు.

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17వ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి.

తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని ఆయన గుర్తుచేశారు. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు ఈ నేలేనని పేర్కొన్నారు. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందని అన్నారు.

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భమిదేనని ముఖ్యమంత్రి వివరించారు. అందుకే సెప్టెంబర్ 17ను “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నామని చెప్పారు.

ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, వారి హక్కులను కాపాడడం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడమని ఆయన వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం అధికమని వివరించారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల బారినుంచి బయటపడేశామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించామని వివరించారు.

ప్రభుత్వ మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని, 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేశామని వివరించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్ఎల్‌బీసీతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని తెలిపారు.

తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా, ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఈ ప్రయాణాలతో మహిళలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందని వివరించారు.

గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1 లక్ష 68 వేల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం అందించామని వివరించారు.

4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల 487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా మార్ట్‌లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళల ఆదాయం పెంచుతున్నామని చెప్పారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ.31 వేల కోట్లు అందించామని చెప్పారు. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.

ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలనేది ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు అందించామని తెలిపారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించామని వివరించారు.

సామాజిక అంతరాలను తగ్గించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించామని చెప్పారు.