రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: హైదరాబాద్ : అమెరికాలో పిజ్జా డెలివరీకి వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ ఫిలడెల్ఫియాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు అన్షుల్ 2023లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ KWC సంస్థలో ఉద్యోగం చేస్తూ నార్త్ ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా కూడా పనిచేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి ఎడ్‌గ్లీ స్ట్రీట్‌లోని రేమండ్ రొసెస్ హొమెస్ ప్రాంగణంలో ఉన్న, సాధారణంగా నిర్మానుష్యంగా ఉండే ఓ ఇంటికి మూడు పిజ్జాల డెలివరీ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్‌ను అందించేందుకు అన్షుల్ రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. వాహనం నుంచి దిగి ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకుని అతనిపై కాల్పులు జరిపారు. మూడు రౌండ్లుగా జరిగిన ఈ కాల్పుల్లో తల వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో అన్షుల్ తీవ్రంగా గాయపడి నేలకుపడ్డాడు. కొద్ది సేపటికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అక్కడుగా వెళ్తున్న కొందరు ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.







