తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం భరణి రోజున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలను ఈసారి కూడా స్వామివారికి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి పాల్గొన్నారు. కాణిపాకం ఆలయం తరఫున పట్టు వస్త్రాలు, సారెను స్వామివారికి సమర్పించగా, ఆలయ ఈఓ యువరాణి, చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రాల సమర్పణ, కాణిపాకం ఆలయము నుండి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను.

అయురారోగ్య అష్టైశ్వర్యాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు డాక్టర్ మురళీమోహన్ తెలిపారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఎమ్మెల్యేలుకు అందించి, వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వదించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు. సుభిక్షమైన పాలన సాగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నిత్యాన్నదానం, ఉచిత లడ్డు, ఉచిత మజ్జిగ పంపిణీతో పాటు వాహనాల పార్కింగ్, శాంతిభద్రతల పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆనందగిరి కొండంతా “హరోం హర” నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృప కోసం ప్రార్థనలు చేశారు. ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.