తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న శేషాచలం అడవుల దిగువ భాగం, అలిపిరి పరిధిలోని అటవీ ప్రాంతం చిరుతపులుల ఆవాస కేంద్రంగా మారింది. తరచూ చిరుతలు కనిపించడం వల్ల స్థానికులు, విద్యార్థులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా సమీపంలోని యూనివర్సిటీల ప్రాంగణాల్లో పరిస్థితి రోజురోజుకూ సమస్యాత్మకంగా మారుతోంది.

అలిపిరి నుంచి చెర్లోపల్లికి వెళ్లే మార్గంలో కుడివైపున దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఎడమవైపున రుయా , SVIMS, అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా కాన్సర్ ఆసుపత్రి, వేదిక్ యూనివర్సిటీ , SVU, SV అగ్రికల్చరల్ యూనివర్సిటీ , SV వెటర్నరీ యూనివర్సిటీ లు ఉన్నాయి. వీటిలో అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా కాన్సర్ ఆసుపత్రి, SV అగ్రికల్చరల్ యూనివర్సిటీ లకు మాత్రమే రక్షణ ప్రహరీలు ఉండగా, SVU, SV వెటర్నరీ యూనివర్సిటీ , వేదిక్ యూనివర్సిటీ లకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు లేవు.

దీంతో కుడివైపున ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుతపులులతో పాటు ఇతర అడవి జంతువులు ఎడమవైపున ఉన్న యూనివర్సిటీల ఆవరణల్లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలోని ఆహార వ్యర్థాలను తినేందుకు జింకలు, అడవి పందులు, కుక్కలు పెద్ద ఎత్తున వస్తుండటంతో, వాటిని వేటాడేందుకు చిరుతలు కూడా ఆ ప్రాంతాల్లోకి చేరుతున్నాయని అటవీశాఖ అధికారులు ముందే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, జూ అధికారుల సహకారంతో ఇప్పటివరకు నాలుగు చిరుతపులులను బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో వదిలారు. యూనివర్సిటీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గత నెల 25న SV వెటర్నరీ యూనివర్సిటీ క్లినికల్ బ్లాక్‌లోని మరుగుదొడ్డిలోకి చొరబడ్డ చిరుతను బంధించి జూకు తరలించారు.

ఇటీవల శుక్రవారం మరో చిరుత SV వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో కనిపించడంతో మళ్లీ ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు ప్రారంభించారు. యూనివర్సిటీ పరిసరాల్లో పహారా బలగాలను మోహరించి, విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యూనివర్సిటీలు, ఆసుపత్రులు, స్థానిక ప్రజలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే చిరుతల సంచారం నియంత్రణలోకి వస్తుందని అటవీశాఖ భావిస్తోంది.