రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ప్రచార దశలోనే చిరంజీవి ప్రత్యేకంగా ముందుకొచ్చి ప్రమోషన్ చేయడం, ట్రైలర్, టీజర్‌లు ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను నెరవేర్చిందా అన్నదే ఇప్పుడు చర్చ.
కథ ఏంటంటే...
గురు (సందీప్ కిషన్) తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన లైబ్రరీని నడుపుకుంటూ, యూట్యూబ్‌లో కథలు చెప్పే వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తండ్రి చేసిన అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో తన ఇంటిని అప్పుల బాధ నుంచి కాపాడుకోవాలంటే ఒక్క రాత్రిలోనే రూ.1.25 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
డబ్బు కోసం తపనపడుతున్న గురు చేతికి విన్సెంట్ (శివ పండిట్) అనే గ్యాంగ్‌స్టర్ నేరాలకు సంబంధించిన పెన్‌డ్రైవ్ ఒకటి చిక్కుతుంది. క్యాసినో, డ్రగ్స్ పేరుతో విన్సెంట్ దోచుకున్న డబ్బుల వివరాలు అందులో ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకుని విన్సెంట్‌ను బెదిరించి డబ్బు సంపాదించాలని గురు ఓ ప్రణాళిక వేస్తాడు.
ఇదే సమయంలో తన రూ.1000 కోట్ల డబ్బు ఉన్న లాకర్ తాళం కోసం అంతర్జాతీయ మాఫియా లీడర్ వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) రంగంలోకి దిగుతాడు. దీంతో గురు–విన్సెంట్–వీరయ్య మధ్య డబ్బు కోసం జరిగే పోరు, ఈ కథలో ఆర్జే సామ్ (ఫరియా అబ్దుల్లా), నీల్ (రాజు సుందరం) పాత్రల ప్రాధాన్యత ఏంటి అన్నదే మిగతా కథ.
ఎలా సాగింది?
‘సిగ్మా’ను మొత్తం మీద చూస్తే ఇది పూర్తిగా రొటీన్ మనీ హైయిస్ట్ థ్రిల్లర్. డబ్బు కోసం హీరో, ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే పోరును జేసన్ సంజయ్ పాతబడిన కథతోనే చెప్పాడు. కథలో థ్రిల్ పంచే మలుపులు, ఊహించని ట్విస్ట్‌లు, బలమైన సంఘర్షణలు కనిపించవు. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ ఎటు వెళ్లబోతుందో ప్రేక్షకులకు స్పష్టమవుతుంది.
ఆరంభ సన్నివేశాలు సాగదీతగా సాగుతాయి. పెన్‌డ్రైవ్ హీరో చేతికి దొరకడం కీలక మలుపు అయినప్పటికీ, అందులో ఏముంది? ఆ సమాచారం బయటపడితే ఎవరికెంత నష్టం? అనే అంశాలను దర్శకుడు బలంగా చూపించలేకపోయాడు. ఆ పెన్‌డ్రైవ్‌ను రూ.1000 కోట్ల లాకర్ తాళంతో లింక్ చేయడం, క్లైమాక్స్ వరకు హీరోకే ఆ సంబంధం తెలియకపోవడం చాలా అసహజంగా అనిపిస్తుంది.
గురు దారిలోకి వీరయ్య రావడం, ఆ నేపథ్యంలో వచ్చే కొన్ని విరామ ఘట్టాలు ఓకే అనిపించినా, ద్వితీయార్థం నుంచి కథ పూర్తిగా గాడి తప్పుతుంది. రూ.1000 కోట్ల కోసం ఇద్దరు విలన్ల మధ్య మైండ్ గేమ్ సాగుతుండగా, మరోవైపు హీరో డబ్బుల కోసం తిప్పలు పడటం, మధ్యలో వచ్చే ఛేజింగ్ సన్నివేశాలు ఏవీ థ్రిల్ పంచలేవు.
హీరో ప్రయాణం మొదలైన మూల కారణం – తల్లి జ్ఞాపకమైన ఇంటిని అప్పుల బాధ నుంచి కాపాడుకోవడం. ఆ భావోద్వేగాన్ని దర్శకుడు తర్వాత మళ్లీ పెద్దగా టచ్ చేయకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే సుదీర్ఘ యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రేక్షకుల సహనానికి మరో పరీక్షగా మారాయి.
ఎవరెలా చేశారు?
సందీప్ కిషన్ ప్రతిభకు ఇది పెద్ద సవాల్‌గా నిలిచే సినిమా కాదు. అయితే మొత్తం సినిమా పొడవునా సెటిల్డ్ నటనతో పాత్రను నెరవేర్చేందుకు ప్రయత్నించాడు. ఫరియా అబ్దుల్లా పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. సంపత్ రాజ్, శివ పండిట్‌లకు వచ్చినవి కూడా రొటీన్ విలన్ పాత్రలే. రాజు సుందరం, అన్బు దాసన్ తదితరుల పాత్రలు పరిమిత గడువులోనే ముగిసిపోయాయి.
జేసన్ సంజయ్ రాసుకున్న కథలో బలం లేకపోవడం, దాన్ని తెరకెక్కించిన తీరు కూడా ఆకట్టుకోకపోవడం ప్రధాన లోపాలు. తమన్ సంగీతం బాగానే అనిపించినా, కథ బలహీనతను దాచలేకపోయింది. క్రిష్ణన్ వసంత్ చిత్రీకరణ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువల పరంగా లైకా ప్రొడక్షన్స్ తన స్థాయికి తగ్గట్టే ఖర్చు పెట్టింది.
ముగింపుగా
బలమైన కథ, భావోద్వేగాలు, థ్రిల్ పంచే మలుపులు లేకపోవడంతో ‘సిగ్మా’ సహనానికి పరీక్ష పెట్టే మనీ హైయిస్ట్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. సందీప్ కిషన్ నటన, రిచ్ విజువల్స్ తప్ప సినిమా మొత్తంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 1.5/ 5













