రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
వన్ బిలియన్ దిశగా ‘ది ఒడిస్సీ’ దూకుడు…
తొలి వీకెండ్‌కే 264 మిలియన్ డాలర్ల ఘనత
ఇంటర్నెట్ డెస్క్: భారీ అంచనాల నడుమ విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన తొలి వారాంతానికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది.
నిర్మాణ సంస్థ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ‘ది ఒడిస్సీ’ మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2,548 కోట్లకు సమానం. నోలన్ కెరీర్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌గా నమోదవడం విశేషంగా నిలిచింది.
భారత మార్కెట్లో కూడా ఈ చిత్రం బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలైన తొలి రోజే ‘ది ఒడిస్సీ’ భారత్‌లో సుమారు రూ.20.76 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలిపి 39.8 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
మూడు రోజుల కలెక్షన్లలో ఉత్తర అమెరికా మార్కెట్ కీలక పాత్ర పోషించింది. మొత్తం 264 మిలియన్ డాలర్లలో 124 మిలియన్ డాలర్లు అక్కడి నుంచే వచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ దూకుడుతో నోలన్ గత చిత్రాల తొలి వారాంతపు రికార్డులను ‘ది ఒడిస్సీ’ అధిగమించింది.
ఇంతకుముందు నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది డార్క్ నైట్ రైజెస్’ తొలి వీకెండ్‌లో 249 మిలియన్ డాలర్లు, ‘ఒప్పెన్ హైమర్’ 181 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. అయితే ‘ది ఒడిస్సీ’ ఈ రెండు చిత్రాల రికార్డులను బ్రేక్ చేసి నోలన్ ఫిల్మోగ్రఫీలో కొత్త మైలురాయిగా నిలిచింది.
హోమర్ రచించిన ప్రసిద్ధ ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. సుమారు రూ.2వేల కోట్ల భారీ బడ్జెట్‌తో కేవలం 91 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం ఈ చిత్రానికి మరో ప్రత్యేకతగా మారింది. భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక నాణ్యత, నోలన్ స్టైల్ కథనం ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మూడురోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ‘ది ఒడిస్సీ’ వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను బట్టి, ఈ చిత్రం నోలన్ కెరీర్‌లోనే కాకుండా హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉన్నదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













