రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై వెలువడుతున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ కోటా ద్వారా నియమితులైన ఉపాధ్యాయులపై YCP నేతలు చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
డిఎస్సి ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయుల నియామకాలు, వారి అర్హతలపై ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులు ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత వేడెక్కింది.
ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి, వైసీపీ తరఫున వస్తున్న ఆరోపణలు నిజానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
“జగన్ వ్యాఖ్యలతో నిజమైన క్రీడాకారులు మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబంలో ఎంతమందికైనా రాజకీయ పదవులు ఉంటాయి. ఒకే కుటుంబంలో చాలా ఉద్యోగాలు రాకూడదా?”
స్పోర్ట్స్ కోటా ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందలేదని, తాము నిజమైన క్రీడాకారులమని వారు స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాలపై వస్తున్న ఆరోపణలతో క్రీడాకారుల కృషి, సాధనను సందేహాస్పదంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల పాటు కఠిన సాధన, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన విజయాల ఆధారంగా ఈ కోటాలో ఉద్యోగాలు పొందామని వారు వివరిస్తున్నారు.
డిఎస్సి స్పోర్ట్స్ కోటా అంశం రాజకీయ వాదోపవాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో, నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత శాఖలు పూర్తి స్థాయి పరిశీలన జరిపి స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య స్పోర్ట్స్ కోటా ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు పేర్కొంటున్నారు.













