ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అనగానే లియోనెల్‌ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్‌ పేర్లు ముందుగా గుర్తుకు వస్తాయి. వారితో పాటు లుకా మోద్రిచ్‌, మాన్యుయెల్‌ నోయర్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లను కూడా అభిమానులు జ్ఞాపకం చేసుకుంటారు. అయితే ఈసారి ప్రపంచకప్‌లో బుల్లెట్‌ కిక్‌లు, అద్భుత అసిస్ట్‌లతో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల కొత్త తరం యువ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. వీరికి అంతగా పేరు లేకపోయినా, ప్రతిభ మాత్రం ఏ మాత్రం తగ్గదు.

తరువాతి తరం సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న లామిన్‌ యమాల్‌పై ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. బార్సిలోనా తరఫున 2025-26 సీజన్‌లో 48 మ్యాచ్‌ల్లో 24 గోల్స్‌, 18 అసిస్ట్‌లు నమోదు చేసిన ఈ స్పెయిన్‌ యువ ఆటగాడు, గత ఏడాది లా లిగా టైటిల్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మిడ్‌ఫీల్డ్‌లో బంతిని అదుపులో పెట్టుకోవడం, కీలక పాస్‌లు ఇవ్వడం, ప్రత్యర్థి రక్షణను ఛేదించి గోల్స్‌ చేయడం యమాల్‌ ప్రత్యేకత. బంతి అతడి పాదాలకి once వచ్చిన తర్వాత సులభంగా కోల్పోడు. ప్రస్తుతం యువ ఆటగాళ్లలో క్లబ్‌ నుంచి సంవత్సరానికి అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడు కూడా యమాలే. సుమారు రూ.183 కోట్లకు సమానమైన మొత్తం అతడి వేతనంగా చెబుతున్నారు.

18 ఏళ్ల యమాల్‌ ప్రపంచకప్‌ అరంగేట్రం మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొడ కండర గాయం నుంచి కోలుకుంటున్న అతడు, స్పెయిన్‌ తొలి మ్యాచ్‌ అయిన ఉరుగ్వేతో పోరులో ఆడకపోవచ్చని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. అయితే తర్వాతి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగితే, తన ప్రతిభను చాటే అవకాశం అతడికి లభించనుంది.

ఫ్రాన్స్‌ జట్టులో కిలియన్‌ ఎంబాపె పేరు ముందుగా వినిపించినా, ఈసారి మరో యువ తార వారెన్‌ జైర్‌ ఎమెరీపై కూడా అభిమానుల దృష్టి నిలిచేలా ఉంది. 20 ఏళ్ల వయసులోనే ఈ మిడ్‌ఫీల్డర్‌ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ తరఫున 182 మ్యాచ్‌లు ఆడాడు. మైదానంలో పాదరసం లా చురుగ్గా కదిలే అతడు, రక్షణలోనూ, దాడిలోనూ సమానంగా రాణిస్తాడు. 16 ఏళ్లకే పీఎస్‌జీ తరఫున అరంగేట్రం చేసిన వారెన్‌, 2023లో 17 ఏళ్ల వయసులోనే ఫ్రాన్స్‌ జాతీయ జట్టుకు తొలి మ్యాచ్‌ ఆడాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో తన ముద్ర వేయాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

బ్రెజిల్‌ జట్టులో నెయ్‌మార్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఈసారి ఎండ్రిక్‌ అనే యువ ఫార్వర్డ్‌ కూడా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. 19 ఏళ్ల ఎండ్రిక్‌ రియల్‌ మాడ్రిడ్‌ తరఫున ఆకట్టుకున్నాడు. ఎక్కువ గోల్స్‌ చేయకపోయినా, చురుకైన పాస్‌లు, ఫినిషింగ్‌ సామర్థ్యంతో జట్టుకు ఉపయోగపడుతున్నాడు. కోప్‌ డి ఫ్రాన్స్‌, ఐరోపా లీగ్స్‌లో అతడు రాణించాడు. ఈ ఏడాది ఆరంభంలో క్రొయేషియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో కేవలం 14 నిమిషాల వ్యవధిలో రెండు కీలక అసిస్ట్‌లు అందించి తన ప్రతిభను చూపించాడు.

ఇంగ్లాండ్‌ తరఫున ఈసారి ప్రపంచకప్‌ ఆడుతున్న నికో రిలీ కూడా ప్రత్యేకంగా గుర్తించదగ్గ ఆటగాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరఫున కీలక మిడ్‌ఫీల్డర్‌గా ఎదిగిన 21 ఏళ్ల నికో, ప్రిమియర్‌ లీగ్‌ ఫైనల్లో అర్సెనల్‌పై రెండు గోల్స్‌ చేసి జట్టుకు విజయం అందించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 గోల్స్‌ చేయడంతో పాటు మరో 6 గోల్స్‌లో భాగస్వామి అయ్యాడు. ఈ సత్తా కారణంగానే ఇంగ్లాండ్‌ కోచ్‌ థామస్‌ టాచల్‌ కోల్‌ పల్మర్‌, ఫిల్‌ ఫోడెన్‌లాంటి ఆటగాళ్లను పక్కనబెట్టి నికోను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవాళ్లతో పాటు లె నార్ట్‌ కార్ల్‌ (జర్మనీ, 18 ఏళ్లు), యాన్‌ డియోమాండే (ఐవరీ కోస్ట్‌, 18 ఏళ్లు), పా కబార్సి (స్పెయిన్‌, 19 ఏళ్లు), డిజిరెడౌ (ఫ్రాన్స్‌, 20 ఏళ్లు), జావో నెవెస్‌ (పోర్చుగల్‌, 21 ఏళ్లు), అర్డా గులెర్‌ (తుర్కియే, 21 ఏళ్లు) వంటి యువ ఆటగాళ్లు కూడా ప్రపంచకప్‌లో మెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ వరుసగా రెండుసార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జావో నెవెస్‌ పోర్చుగల్‌ తరఫున కీలక ఆటగాడిగా నిలుస్తాడని అంచనా. రొనాల్డోతో కలిసి అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.

ఫ్రాన్స్‌ జట్టుకు ఆడుతున్న మరో పీఎస్‌జీ స్టార్‌ డిజైర్‌ కూడా చూడదగ్గ ఆటగాడిగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్లో ఇంటర్‌ మిలాన్‌పై గోల్‌ చేసి పీఎస్‌జీ విజయంలో భాగమయ్యాడు. ఈసారి ప్రపంచకప్‌ వేదికగా ఈ యువ తారలందరూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.