రాయలసీమ న్యూస్, తిరుపతి:
తిరుమలలో నిఘా వైఫల్యం:
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సెల్‌ఫోన్ వీడియో కలకలం
తిరుమలలో భద్రతా వ్యవస్థలో లోపం వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లోకి ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ప్రవేశించి వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆ వీడియోను అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా తిరుమలలో భక్తులు క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలోకి వెళ్లే ముందు కఠినమైన తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీల్లో సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం తితిదే భద్రతా సిబ్బంది సాధారణ ప్రక్రియ. అయితే ఈ ఘటనలో సంబంధిత భక్తుడు తనిఖీలను దాటుకుని సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లడం నిఘా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఆ వీడియోను అధికారులు తొలగించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై తితిదే విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టినట్లు సమాచారం. భద్రతా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో, ఎలా సెల్‌ఫోన్ లోపలికి వెళ్లిందో తెలుసుకునేందుకు సంబంధిత విభాగం పరిశీలన కొనసాగిస్తోంది.
తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థ అమల్లోనే: తితిదే
తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థను నిరంతరాయంగా అమలు చేస్తున్నామని తితిదే సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. వందలాది మంది భద్రతా సిబ్బంది భక్తుల తనిఖీలు, స్కానింగ్ విధుల్లో నిమగ్నమై ఉన్నారని తితిదే పేర్కొంది.
ఏదైనా కారణంతో మొదటి అంచెలో గుర్తించని ఎలక్ట్రానిక్ పరికరాలు తదుపరి అంచెల్లో తప్పకుండా గుర్తించేలా వ్యవస్థను అమలు చేస్తున్నామని, అలాంటి పరికరాలను స్వాధీనం చేసుకుని నిర్దేశిత డిపాజిట్ విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నామని తితిదే స్పష్టం చేసింది.
ఆదివారం ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు మొబైల్ ఫోన్ తీసుకువచ్చిన ఘటనను తితిదే ప్రస్తావించింది. రెండో అంచెగా ఉన్న డౌన్ స్కానింగ్ పాయింట్లో ఆ మొబైల్ ఫోన్‌ను భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తితిదే వెల్లడించింది. భద్రతా వ్యవస్థ సమర్థతను ఈ ఉదాహరణ ప్రతిబింబిస్తోందని, భక్తుల సురక్షిత దర్శనానికి తితిదే ఎలాంటి రాజీ పడదని సంస్థ స్పష్టం చేసింది.
తిరుమలలో రోజూ లక్షలాది భక్తులు దర్శనానికి రావడం, అలాంటి పరిస్థితుల్లో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని భక్తుల వర్గాలు భావిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తితిదే చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.













