రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవలు భక్తులకు దర్శనానందం కలిగించనున్నాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం కార్యక్రమాలు ఉండవని టీటీడీ వెల్లడించింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం వాహనసేవలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవలు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడవాహనసేవ మాత్రం ప్రత్యేకంగా రాత్రి 6.30 గంటల నుండి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి:
అక్టోబరు 11న అంకురార్పణం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.
అక్టోబరు 12న ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.
అక్టోబరు 13న ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం ఉంటుంది.
అక్టోబరు 14న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనం నిర్వహిస్తారు.
అక్టోబరు 15న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం ఉంటుంది.
అక్టోబరు 16న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు.
అక్టోబరు 17న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనం ఉంటుంది.
అక్టోబరు 18న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం నిర్వహిస్తారు.
అక్టోబరు 19న ఉదయం 7 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం ఉంటుంది.
అక్టోబరు 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.
ఈ వివరాలను టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ప్రకటన ద్వారా విడుదల చేశారు.













