తిరుమల కొండపై టాక్సీ డ్రైవర్ల అధిక ఛార్జీల వసూళ్లు, భక్తులపై జరుగుతున్న దోపిడీ మరోసారి చర్చనీయాంశమైంది. టాక్సీ కోసం రూ.4 వేలకుపైగా చెల్లించాల్సి వచ్చిందని ఓ భక్తుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్‌ సిబ్బందికి కూడా కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని డ్రైవర్లు చెప్పినట్లు ఆ భక్తుడు పేర్కొనడం గమనార్హం.

తిరుమల కొండపై, చుట్టుపక్కల దర్శనీయ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చే భక్తులలో చాలామంది అక్కడి టాక్సీలను ఆశ్రయిస్తుంటారు. అయితే కొందరు టాక్సీ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ భక్తులను నిలువునా దోచుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఏ ప్రాంతం ఎంత దూరంలో ఉందో తెలియక చాలామంది భక్తులు డ్రైవర్లు అడిగినంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.

స్వల్ప దూర ప్రయాణాలకే ఒక్కోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రేట్లు మరింత పెరిగి రూ.500 నుంచి రూ.800 వరకు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుమల బస్టాండ్‌ నుంచి సర్వదర్శనానికి వెళ్లేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరానికే ఒక్కో వ్యక్తి నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొందరు డ్రైవర్లు వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటు, అతివేగంగా నడుపుతున్నారని భక్తులు చెబుతున్నారు. దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలకు ప్రతిరోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు, వీవీఐపీలు వస్తుంటారు. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసు విభాగంపై భారీ భారం పడుతోంది. భక్తుల వాహనాల రద్దీ, వీవీఐపీల పర్యటన వాహనాల నియంత్రణ రెండూ ఒకేసారి నిర్వహించాల్సి రావడంతో ట్రాఫిక్‌ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం తిరుమల ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం పరిధిలో ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కానిస్టేబుళ్లు తిరుమలలోని పది రద్దీ పాయింట్లలో రెండు షిఫ్టుల్లో పది మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. అయితే ట్రాఫిక్‌ రద్దీ పాయింట్లు 25 వరకు ఉండటంతో కనీసం మరో పది నుంచి 20 మంది కానిస్టేబుళ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు.

ఈ లోటును భర్తీ చేయడానికి తితిదే ఆధ్వర్యంలో ఐదుగురు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు ఎక్స్‌సర్వీస్‌మెన్‌ను ట్రాఫిక్‌ నియంత్రణకు కేటాయించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రాఫిక్‌ వ్యవహారాలను ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను సీఐ స్థాయి అధికారికి అప్పగించారు.

తిరుమలకు రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు వస్తున్నారు. కొండపై వివిధ ప్రదేశాలను దర్శించేందుకు తితిదే ఉచిత ధర్మరథాలను ఏర్పాటు చేసినా, వారాంతాల్లో వీటిలో తీవ్ర రద్దీ ఉంటుంది. దీంతో చాలామంది భక్తులు ప్రైవేటు టాక్సీలు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో ట్రాఫిక్‌ ప్రీపెయిడ్‌ టాక్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఛార్జీలకు ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేస్తే దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.