‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కొనసాగింపు

గంజాయి రహిత సమాజమే లక్ష్యం

తిరుపతి: యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడి, గంజాయి రహిత సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని తిరుపతి జిల్లా పోలీసులు ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గాజులమాండ్యం సీఐ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్‌ఐ ఎస్. హరీషతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక బయోచెక్ కిట్ల ద్వారా గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. గంజాయి వినియోగదారులను శాస్త్రీయంగా గుర్తించి, వారి ద్వారా సరఫరా వ్యవస్థలోని ప్రధాన నిర్వాహకులు, మధ్యవర్తులు, విక్రేతలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.

డీఎస్పీ వై. శ్రీనివాసరావు గంజాయి దుష్ప్రభావాలు, మాదకద్రవ్యాల వ్యసనంతో కలిగే సామాజిక, కుటుంబ, వ్యక్తిగత నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి కేసుల్లో గతంలో నమోదైన నిందితులు, విక్రేతలు, వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని ఆయన వివరించారు. పోలీసుల లక్ష్యం కేవలం నేరస్తులను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా, వ్యసనానికి బానిసైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

గంజాయి వ్యసనానికి గురైన యువతకు తల్లిదండ్రుల సమ్మతితో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాపానాయుడుపేటలోని RASS పునరావాస కేంద్రం, స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, పునరావాస సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు గంజాయి వల్ల తీవ్రంగా దెబ్బతినడంతో పాటు యువత నేరాల వైపు మళ్లే ప్రమాదం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు హామీ ఇస్తున్నారు.

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కార్యక్రమం ద్వారా గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.