రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి : తిరుపతి నగర పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా కఠినంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే తీవ్ర ప్రభావం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. అవసరమైతే క్యాబ్, ఆటో లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని తీసుకోవాలి. ఒక చిన్న నిర్లక్ష్యం విలువైన ప్రాణాలను బలితీసుకునే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తుంది.
తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రజల ప్రాణ భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత బలోపేతం చేస్తోంది. మద్యం సేవించి వాహనం నడపవద్దని, అలాంటి చర్యలు తమ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
వాహనదారులకు ముఖ్య సూచనలు ఇస్తూ, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ కట్టుకోవాలని సూచించారు. నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే Dial-112కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే సురక్షితమైన తిరుపతి నగరాన్ని నిర్మించగలమని తిరుపతి జిల్లా పోలీసులు ప్రజలను కోరుతున్నారు.













