రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 22వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. దీంతో కారు రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులోకి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి తిరుపతి SIMS ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సతీష్ కుమార్ (72) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్ , గొట్టిగెరె ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.
మొత్తం నలుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలు కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకుని, దర్శనం ముగించుకుని తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సతీష్ కుమార్ కుమారుడు సాయి శ్రీనివాస్ , కుమార్తె సింధు Udath, మనవరాళ్లు Tiya, నైరా లకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరికి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు పేర్కొన్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనాన్ని క్రేన్ సాయంతో పైకి తీసి రోడ్డు పక్కకు తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఘాట్ రోడ్‌పై వాహనాల రాకపోకలు మందగించాయి. అనంతరం ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్‌పై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని పోలీసులు సూచిస్తున్నారు.













