జమ్మలమడుగు : విజయవాడలో జరగనున్న దళిత గర్జన పర్యటనలో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ జమ్మలమడుగు నియోజకవర్గానికి సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి, కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.

సమావేశంలో మాట్లాడిన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్రంలో దళిత, గిరిజనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో దళిత, గిరిజనుల పాత్రకు గుర్తింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దళితులకు రక్షణ ఎక్కడ, దళిత సంక్షేమం ఎక్కడ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు ఎక్కడ, భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు ఎక్కడన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్‌లో జరగనున్న దళిత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలు ఏకమై రాజ్యాధికార సాధన కోసం సిద్ధపడాలని ఆయన కోరారు.

జమ్మలమడుగులో జరిగిన ఈ కార్యకర్తల సమావేశంలో ఎమ్మార్పీఎస్ కడప జిల్లా ఇన్‌చార్జిగా ఏ. నర్సింలు మాదిగను, జమ్మలమడుగు టౌన్ ఇన్‌చార్జిగా సిపాపోడు మాదిగను, మైలవరం ఇన్‌చార్జిగా కె. రాముడును, పెద్దముడియం ఇన్‌చార్జిగా వై. చంద్రుడును, ముద్దనూరు ఇన్‌చార్జిగా ఎం. భాస్కర్ వీరయ్యను, ప్రొద్దుటూరు ఇన్‌చార్జిగా దాసరి కుమార్‌ను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జంగాల మునుస్వామిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు డి. చెన్నమ్మ, కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి మేరీ, కడప జిల్లా ఎమ్మెల్యే ఉపాధ్యక్షులు పాములేటి పాల్గొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు గడ్డం నరసింహుల మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.