అమరావతి : ఉత్తరాంధ్ర వాసుల ఎన్నేళ్ల స్వప్నం సాకారమైంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూమిని తాకాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌పురం వద్ద మంగళవారం సాయంత్రం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ముందుగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణిస్తూ మార్గమంతా ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై కార్యక్రమంలో పాల్గొని, అనంతరం రెగ్యులేటర్‌ను ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి అధికారికంగా విడుదల చేశారు.

గోదావరి జలాలు కాలువలో ప్రవహించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. గోదారమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కాలువలోకి ప్రవహిస్తున్న జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ముందుగా తుని మండలంలోని కుమ్మరిలోవ వరకు చేరాయి. అక్కడి నుంచి రాత్రి 7.46 గంటలకు తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టులోని ఆరు మార్గాల ద్వారా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలోకి ప్రవేశించాయి. దీంతో ఉత్తరాంధ్రలో సాగునీటి విస్తరణకు, తాగునీటి అవసరాల తీర్చడంలో ఈ కాలువ కీలక పాత్ర పోషించనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం. రమేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఎడమ కాలువ ద్వారా నీటి పంపిణీపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరాలు అందించారు.

ఉత్తరాంధ్రలో సాగునీటి కొరతను తీర్చే దిశగా పోలవరం ఎడమ కాలువ నీటి విడుదలను స్థానికులు మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. గోదావరి జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో పాయకరావుపేట, పరిసర మండలాల్లో పండుగ వాతావరణం నెలకొంది.