రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు, : యోగానే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని అందించగలదని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగంగా మారాలని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 12 యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం గండికోట చారిత్రక పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా పర్యాటక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులకు యోగా గురువులు వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచే యోగా సాధన ద్వారా మునులు, ఋషులు, యోగులు తపోనిష్ఠలో భాగంగా యోగాసనాలు, ప్రాణాయామాలు ఆచరిస్తూ అనారోగ్యాలను దరిచేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు. మానసిక సమస్యలు, శారీరక రుగ్మతలకు యోగా మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7 నుండి 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో "యోగాంధ్ర క్యాంపెన్ - 2025" నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు పౌరులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విస్తృతంగా వివరించారని చెప్పారు.
పర్యాటక యోగా థీమ్‌లో భాగంగా అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన గండికోట పర్యాటక క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జిల్లాకే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. "హ్యాపీ ఆంధ్రప్రదేశ్ - హెల్తీ ఆంధ్రప్రదేశ్" నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో ఈ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రేరణాత్మక కార్యక్రమంగా అమలు చేస్తున్నాయని తెలిపారు.
యోగాసనాల సాధన ద్వారా క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో ఒక దినచర్యగా అలవర్చుకోవాలని ఆయన సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గండికోట జిల్లాలోనే అత్యంత సుభిక్షమైన ప్రాంతమని, ఇక్కడ ప్రవహించే పెన్నా నది పుణ్యదాయకమని, జమ్మలమడుగు నియోజకవర్గం అన్ని రకాల వనరులతో రాష్ట్ర, దేశ ఆర్థిక ప్రగతికి మైలురాయిగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను సుభిక్షం చేసే దిశగా అడుగులు వేస్తోందని, బనకచర్ల గోదావరి ప్యాకేజీ ద్వారా రాయలసీమకు నీరు అందితే ఇక్కడి రైతాంగం, పారిశ్రామిక రంగానికి మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. చారిత్రక వైభవం కలిగిన గండికోట ప్రాంతం పెన్నా నది తీరంలో సుభిక్షమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, పారిశ్రామిక వాడలతో ప్రత్యేక ఆకర్షణగా ఎదుగుతోందని, సోలార్, వ్యాపార, పారిశ్రామిక రంగాలతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభిస్తుందనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.
పర్యాటక మ్యాపులో ఇప్పటికే విశిష్ట స్థానం సంపాదించిన గండికోట పర్యాటకంగా మరిన్ని అభివృద్ధి పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ స్వీయ బాధ్యతగా స్వీకరించి సామాజిక ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడాలని, ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో యోగా కార్యక్రమాలను ప్రాధాన్యతతో నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
యోగాంధ్ర మాసోత్సవాల్లో నేర్చుకున్న యోగాసనాలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి నిత్య జీవితంలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోరినట్లు అధికారులు తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21 వరకు జిల్లా యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్‌డీ ఓ శిరీష, జెడ్పి సీఈఓ సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, టూరిజం అధికారి సురేష్ కుమార్, తహశీల్దార్ సాయినాథ్ రెడ్డి, జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, గండికోట గ్రామ ప్రజా ప్రతినిధి ఈశ్వర్, జిల్లా అధికారులు, ఆయుష్ సిబ్బంది, పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.













