రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: YVU ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు డా. పార్నపల్లి మునిమౌనిక ప్రఖ్యాత CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్‌లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా ఎంపికయ్యారు. ఈ నియామకంతో యోగి వేమన యూనివర్సిటీ (YVU)లో అకాడమిక్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
డా. మునిమౌనిక YVUలో ఫిజిక్స్ విభాగంలో ప్రొ. ఎం. రాఘవేంద్ర పర్యవేక్షణలో తన పరిశోధన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆమె చేసిన పరిశోధనకు లభించిన గుర్తింపుతో IICTలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పదవికి ఎంపిక కావడం విశ్వవిద్యాలయానికి గౌరవకరంగా భావిస్తున్నారు.
లింగాల మండలం లోపట్నూతల మారుమూల గ్రామానికి చెందిన మునిమౌనిక, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నత స్థాయి పరిశోధనా సంస్థలో స్థానం సంపాదించడం ద్వారా పట్టుదలతో ముందుకు సాగితే అవకాశాలు లభిస్తాయని మరోసారి నిరూపించారు. ఆమె విద్యాభ్యాసం, పరిశోధన ప్రయాణం YVUలో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
CSIR- ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ దేశంలో ప్రముఖ రసాయన పరిశోధనా సంస్థగా పేరుపొందింది. ఈ సంస్థలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా ఎంపిక కావడం ద్వారా డా. మునిమౌనికకు రసాయన శాస్త్రం, సంబంధిత అంతరశాఖల పరిశోధన రంగాల్లో పనిచేసే అవకాశం లభించనుంది. ఆమె ఫిజిక్స్ నేపథ్యం IICTలో జరుగుతున్న వివిధ పరిశోధన ప్రాజెక్టులకు తోడ్పడుతుందని విశ్వవిద్యాలయ వర్గాలు భావిస్తున్నాయి.
YVU వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, డా. మునిమౌనిక IICTలో ఎంపిక కావడంపై అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా కృషి, నిబద్ధతతో దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో స్థానం సంపాదించగలరని ఈ ఎంపిక మరోసారి చాటిందని ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు డా. మునిమౌనిక విజయాన్ని శుభాకాంక్షలతో అభినందించారు.













