భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కారు డ్రైవర్‌ను యజమానే హత్యకు గురి చేసిన ఘటన కడపలో వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కడప రిమ్స్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ మంగళవారం రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

సీఐ రాజగోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం… కడప రిమ్స్‌ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో రామసుబ్బారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం రామసుబ్బారెడ్డి కొన్నేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. ఇంటి అవసరాల నిమిత్తం చిట్వేలికి చెందిన వంశీ (25)ను కారు డ్రైవర్‌గా నియమించి విదేశానికి వెళ్లాడు. ఏడాది క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన రామసుబ్బారెడ్డి, తన భార్య డ్రైవర్‌ వంశీతో చనువుగా మెలగడాన్ని గమనించాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కలిగి, దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని సీఐ వివరించారు.

ఈ నేపథ్యంలో వంశీని అడ్డుగా భావించిన రామసుబ్బారెడ్డి, అతన్ని తొలగించాలనే ఉద్దేశంతో హత్యకు పూనుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. బుడ్డాయపల్లెకు చెందిన దేవకుమార్‌, మోడమీదపల్లెకు చెందిన నాగార్జున, శ్రీనివాసులతో కలిసి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీ పని ఉందని చెప్పి వంశీని తనతో పాటు తీసుకెళ్లాడు. సింగపూర్‌ టౌన్‌షిప్‌లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కత్తులతో దాడి చేసి వంశీని హత్య చేసినట్లు సీఐ వివరించారు.

తర్వాత మృతదేహాన్ని కారులో లోడుచేసి సోమశిల జలాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారని తెలిపారు. వంశీ కనిపించకపోవడంతో అతని తండ్రి మునెయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా యజమాని రామసుబ్బారెడ్డి సహా నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్టు సీఐ రాజగోపాల్‌ చెప్పారు.

ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి పరారీలో ఉన్నాడని, అతని అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీఐ రాజగోపాల్‌ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సై చంద్రమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.