వర్షాభావంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే వైఎస్సార్ కడప జిల్లాలో ఈసారి జలవనరులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. సీజన్‌లో నదులు, వాగులు, వంకల ద్వారా వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిని చెరువులకు మళ్లించి సంరక్షించే పనులకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఆరు నెలల వ్యవధిలోనే ఈ చర్యలు గణనీయమైన ఫలితాలు ఇచ్చాయి.

జిల్లాలోని నదులు సుదూర ప్రాంతాల వరకు విస్తరించేలా పనులు చేపట్టగా, గతంలో ఏటా 50-100 టీఎంసీల నీరు నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టుకు చేరి అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతుండేది. జలవనరుల అనుసంధాన పనుల ద్వారా ఆ వృథా నీటిలో సుమారు 12 టీఎంసీలను చెరువులకు మళ్లించగలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో విజయవంతంగా అమలైన ‘జలధార’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా వంద రోజుల ప్రణాళికగా విస్తరించడం, ఇక్కడి అధికారుల సమన్వయ కృషికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నేతృత్వంలో జలధార పనుల ప్రగతి, అమలు తీరు, సాధించిన ఫలితాలపై వివిధ శాఖల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. ఏటా ఉపాధి నిధుల కింద వేల కోట్లు వెచ్చించినప్పటికీ గతంలో పునరావృత పనులకే పరిమితమై, స్థిరమైన ఫలితాలు రాలేదని అధికారులు విశ్లేషించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 4,748 పనుల్లో, జలవనరుల అనుసంధానానికి ఉపయోగపడే 4,398 పనులను ఎంపిక చేసి, వాటికి రూ.83 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపారు.

ఈ పనులన్నీ చెరువులు, కుంటలు, వాగులు, వంకల నవీకరణకు సంబంధించినవే కావడంతో భూగర్భ జలాల సంరక్షణ, వృథా నీటిని నిల్వ వనరులకు తరలించడం సాధ్యమైంది. జిల్లాలో నదుల ఆధునికీకరణకు కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా మాండవ్య నదిని శుభ్రపరచి, నీటిని నిల్వ చేసే పనుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేశారు. నదీ పరివాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

బాహుదా, పెద్దేరు, పింఛ నదుల ఆధునికీకరణకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. నదుల్లో ప్రవహించే నీటి వేగాన్ని తగ్గించి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. వర్షాకాలంలో నీటిని చెరువులకు మళ్లించేందుకు మొబైల్‌ లిఫ్ట్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో విస్తరించిన జలవనరులపై ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. శాటిలైట్‌ సర్వే ద్వారా చెరువులు, కుంటలు, చిన్న జలవనరులను సులభంగా గుర్తించి, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే రెండు విడతల్లో గుర్తించిన పనులు పూర్తి దశకు చేరుకున్నాయి.

వంద రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలో 104 జల సంరక్షణ పనులు చేపట్టి, తొలి విడతగా రూ.2 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇవి దాదాపు పూర్తికావచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన మరో రూ.7.8 కోట్లతో అదనపు పనులు చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

జలధార పనుల ప్రభావంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం, వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతోంది. చిరుధాన్యాలు, వరి పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు గణనీయంగా విస్తరించింది. గతంలో ఏటా 5-7 వేల హెక్టార్లకే పరిమితమయ్యే ఉద్యాన తోటల సాగు ఈసారి 24 వేల హెక్టార్ల లక్ష్యాన్ని చేరుకుంది.

వేసవికాలంలో నీటి లభ్యత లేక ఎండుముఖం పట్టే మామిడి తోటలు ఈసారి మెరుగైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత మే నెలలో 22 వేల టన్నుల మామిడి దిగుబడి, జూన్‌లో ఇప్పటివరకు 34 వేల టన్నుల ఉత్పత్తి మార్కెట్‌కు చేరింది. పశుగ్రాసం సాగు విస్తరించడంతో పాల ఉత్పత్తి పెరిగి, కరవు ప్రాంత ప్రజలకు పరోక్షంగా ఆదాయం పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులకు నీరు చేరేందుకు సహజ సిద్ధంగా ఏర్పడిన వంకలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి నీటిని మళ్లించేందుకు పూర్వీకులు తవ్వించిన కాలువలను ఇప్పుడు మళ్లీ వినియోగంలోకి తెస్తున్నారు. బాహుదా, పింఛ, మాండవ్య, చెయ్యేరు, పెద్దేరు నదుల నుంచి 83 అనుసంధాన కాలువలను గుర్తించి మరమ్మతులు చేయించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తొలి వర్షాలతోనే ఈ జలధారల ఫలితాలు స్పష్టంగా కనిపించనున్నాయని అధికారులు భావిస్తున్నారు.