కడప: సేవ్ డెమోక్రసీ – ఓట్ బచావో – దేశ్ బచావో నినాదంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిసిసి కార్యాలయం నుండి నూతన కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో ప్రొద్దుటూరు నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా, ఇండియా కూటమి వైయస్సార్ కడప జిల్లా కన్వీనర్ ఎన్.డి. విజయ జ్యోతి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలపై దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకునే స్థాయిలో స్పందన లేదని విమర్శించారు. ఓటర్ల జాబితాలను సవరించే యంత్రాంగం నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి రాకపోయేదని వ్యాఖ్యానించారు.ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి నరేష్ కుమార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వెలువడిన సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకుని ఉంటే అనుమానాలు ఈ స్థాయికి పెరిగేవి కాదని నాయకులు అభిప్రాయపడ్డారు.

మోడీ, అమిత్ షాతో కలిసి జ్ఞానేష్ కుమార్‌ను నడిపిస్తున్నారన్నట్టుగా వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేయడానికి ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.ఓటర్ల నమోదులో ఫారం–6 విషయంలో అనుమానాలు వ్యక్తమైనప్పుడు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు దిగజారేదని నాయకులు వ్యాఖ్యానించారు. జ్ఞానేష్ కుమార్ ఫారం–6ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చినట్టు ఇప్పుడు స్పష్టమైందని, బిజెపికి సహాయం చేయడానికి ఆయన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణకు ఇది మరో రుజువుగా నిలుస్తుందని ఇండియా కూటమి నాయకులు తెలిపారు.

ర్యాలీ సందర్భంగా పాల్గొన్నవారు జాతీయ గీతం ఆలకించి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రతి ఒక్కరితో చదివించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.నిబంధనలకు వ్యతిరేకంగా ప్రధాని ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ బిజెపికి పరోక్షంగా సహాయపడ్డారని రుజువైనందున, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు.