వైయస్సార్‌ కడప నగరంలో వర్షాకాలం సమీపిస్తున్న వేళ ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత కొన్నేళ్లుగా ప్రతి వర్షాకాలానికీ నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగిపోవడం, మురుగు నీరు రోడ్లపైకి రావడం సాధారణంగా మారిపోయింది. ఈసారి కూడా అదే పరిస్థితులు పునరావృతమవుతాయేమోనన్న భయం కడప వాసులను వేధిస్తోంది. కారణం – వరద, మురుగు కాలువల నిర్మాణం, పూడికతీత పనుల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యం.

పట్టణాలు, నగరాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి నగరాల్లో రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతుల నిర్వహణ సక్రమంగా ఉంటేనే అభివృద్ధి వేగం అందుకుంటుంది. కానీ కడపలో గత, ప్రస్తుత పాలకులు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేసవి ముగిసే సరికి రుతుపవనాలు మొదలవుతాయంటేనే ప్రజలు బెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది.

నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు రూ.69.5 కోట్ల వ్యయంతో 23 వరద కాలువల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం జాతీయ రహదారి 40, మినీ బైపాస్‌ రోడ్డు, ఎన్జీఓ కాలనీ రోడ్డు, హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఆర్టీసీ బస్టాండ్‌–కోటిరెడ్డి కూడలిలోని బుగ్గ వంక వరద కాలువల పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇవి పూర్తికాకపోవడంతో ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. దాదాపు 15 చోట్ల వరద కాలువల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

ఆర్టీసీ బస్టాండ్‌–మహావీర్‌ మార్గం, కోటిరెడ్డి సర్కిల్‌–అంబేడ్కర్‌ సర్కిల్‌, వై.జంక్షన్‌–అప్సరా సర్కిల్‌–సంజన్న కూడలి, వన్‌టౌన్‌ సర్కిల్‌–పొట్టి శ్రీరాములు కూడలి, ఎన్టీఆర్‌ కూడలి, శ్రీకృష్ణదేవరాయలు కూడళ్లలో ఓ మోస్తరు వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయి. వైవీ స్ట్రీట్‌, హనుమప్ప వీధి, పాత మార్కెట్‌, కటికవీధి, నకాశ్‌ ప్రాంతాల్లో మురుగు కాలువలు పొంగిపొర్లి రోడ్లపైకి వస్తున్నాయి. మురుగు నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పూడికతీత పనుల్లోనూ అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలోని కీలకమైన 14 కాలువల్లో 9,500 మీటర్ల పొడవున పూడికతీతకు రూ.67 లక్షల వ్యయంతో పనులు చేపట్టాలని ఇంజినీరింగ్‌ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సరోజినీ నగర్‌ (రూ.6.95 లక్షలు), భవానీ నగర్‌–అక్కాయపల్లి ప్లాజా (రూ.4.50 లక్షలు), అలంఖాన్‌పల్లి (రూ.5.45 లక్షలు), ఎన్టీఆర్‌ సర్కిల్‌–డీసీసీ బ్యాంకు మధ్య (రూ.1.27 లక్షలు) కాలువల్లో పూడికతీతకు టెండర్లు పిలవాల్సి ఉంది. మద్దేఖాన్‌ మసీదు, క్రిష్ణా కూడలి–మాచుపల్లి బస్టాండ్‌, రైల్వే అండర్‌ బ్రిడ్జి, తెలుగు గంగ కార్యాలయం–ఆర్ట్స్‌ కాలేజీ, పక్కీరుపల్లి చెరువు, మేరీ నగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, మహావీర్‌ కూడలి–ఆర్టీసీ బస్టాండ్‌ వరకు కాలువల్లో పూడికతీత పనులు ఇంకా ఒప్పంద దశలోనే ఉన్నాయి.

కేసీ కెనాల్‌ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దేవుని కడప రోడ్డు సమీపంలోని కేసీ కెనాల్‌ పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. ఎన్‌హెచ్‌40 నుంచి అగాడీ, నకాశ్‌, నెహ్రూ నగర్‌, గౌస్‌నగర్‌ మీదుగా సాగే ఈ కాలువ మురికి కూపంలా మారిపోయింది. వరద, మురుగు నీరు కేసీ కెనాల్‌లో చేరి ముందుకు సాగాల్సి ఉండగా, కాలువ శుభ్రపరచకపోవడంతో ప్రవాహం స్తంభిస్తోంది. కేసీ కెనాల్‌ అధికారులు ఇది తమ పరిధిలోదికాదని, నగరపాలక అధికారులు తమ బాధ్యత కాదని తప్పించుకోవడంతో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతోంది. ఈ నిర్లక్ష్యం కొనసాగితే కడప నగరంలో ఈ వర్షాకాలంలోనూ మునక ముప్పు తప్పదన్న ఆందోళన నగరవాసుల్లో పెరుగుతోంది.