రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
కడపలో ఎనిమిదో తరగతి బాలికలు పరార్.. ఫోన్ వ్యసనమే కారణం
కడప జిల్లాలో సెల్‌ఫోన్ వ్యసనం ఇద్దరు బాలికల జీవితాలను తాత్కాలికంగా తారుమారు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మొబైల్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంట్లో ఉన్న నగదును తీసుకుని, ఫోన్‌లతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ ఘటన కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కడప తాలూకా పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు బాలికలు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ మొబైల్ ఫోన్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, చదువుపై ఆసక్తి తగ్గిందని తల్లిదండ్రులు గమనించారు. దీనిపై వారు పలుమార్లు మందలించడంతో బాలికలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఫోన్ వినియోగంపై ఇంట్లో మందలింపులు పెరగడంతో, మొబైల్ వ్యసనం అధికమవడంతో ఇద్దరు బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో తిట్లు, మందలింపులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో, స్వేచ్ఛ కోసం ఊరిని విడిచి వెళ్లిపోతే బాగుంటుందనే భ్రమకు లోనైనట్లు విచారణలో బయటపడింది.
ఈ క్రమంలో ముందుగానే ప్లాన్ చేసుకున్న బాలికలు సరైన సమయం కోసం ఎదురుచూశారు. అందులో భాగంగా ఓ బాలిక తన ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదును తీసుకుంది. అనంతరం ఇద్దరూ తమ తమ ఇళ్లలో తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. అయితే స్కూల్ ముగిసిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.
సాయంత్రం వరకు బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో బాలికలు తమ మొబైల్ ఫోన్‌లను కూడా తీసుకుని వెళ్లిన విషయం తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు.
ఈ సమాచారంతో పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా బాలికల కదలికలను ట్రాక్ చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే కడప తాలూకా పోలీసులు తమ సిబ్బందిని హైదరాబాద్‌కు పంపి అక్కడ బాలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తరువాత ఇద్దరు బాలికలను కడపకు తీసుకువచ్చి తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్నారులపై మొబైల్ ఫోన్ ప్రభావం, తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ కేసు వివరాలను నమోదు చేసి, బాలికల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులకు తగిన సూచనలు చేసినట్లు సమాచారం.













