రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఎండబారిన పరిస్థితులు ఎదుర్కొంటోందని, జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత రైతులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం ఎర్రగుంట్ల మండలం సిరాజుపల్లి గ్రామంలో ఎండిపోయిన చీని తోటలను దడాల సుబ్బారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావం, భూగర్భ జలాల పడిపోవడం, పంటల నష్టం వంటి అంశాలను వివరించారు.
జిల్లాలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటల సాగు దెబ్బతిన్నదని, ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని ఆయన పేర్కొన్నారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరువు పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపించి, క్షేత్రస్థాయిలో కరువు అంచనా వేయాలని దడాల సుబ్బారావు కోరారు. ప్రభుత్వ గణాంకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని సమగ్ర కరువు నివేదిక రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కరువు ప్రభావిత మండలాలను అధికారికంగా ప్రకటించి, ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకు, చెరువుల నింపుదలకు, ఆరుతడి పంటల రక్షణకు వినియోగించి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు.
తెలుగు గంగ, కేసీ కెనాల్‌కు అవసరమైన నీటి విడుదల కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని దడాల సుబ్బారావు కోరారు. కరువు ప్రభావిత రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరువు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అవసరమైన కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రబీ సీజన్‌లో రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని దడాల సుబ్బారావు కోరారు.
కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కరువు పనులు ప్రారంభించి రోజుకు 700 రూపాయల చొప్పున వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కరువు బాధిత రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, రానున్న రోజుల్లో దశలవారీగా పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఈ కరువు పర్యటన కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి. అన్వేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, కడప సిటిజన్ ఫోరం నాయకుడు కుమారస్వామి రెడ్డి, మండల రైతు సంఘం నాయకుడు శివారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు భాషా తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.













