రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: కడప జిల్లా పౌరుషాల గడ్డగా పేరుపొందిన స్థితి నుంచి పారిశ్రామిక, పర్యాటక, ఆధ్యాత్మిక, వ్యవసాయ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ ఆధునిక జిల్లాగా రూపాంతరం చెందుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సహకారం, ప్రజాప్రతినిధుల కృషి, యువతలో వచ్చిన మార్పులతో పెట్టుబడులు, ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అభివృద్ధికి కడప కేంద్రబిందువుగా మారాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
చారిత్రక, ఆధ్యాత్మిక, సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న కడప జిల్లా రాయలసీమ అభివృద్ధికి కేంద్రబిందువుగా మారే సామర్థ్యం కలిగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లాకు ఉన్న ప్రత్యేకతలను సమర్థంగా వినియోగించుకుంటే ప్రాంతీయ అభివృద్ధికి కడప కీలకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కడప జిల్లా చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వం, సహజ వనరులు, వ్యవసాయ సంపదను ప్రస్తావించిన పీవీఎన్ మాధవ్, దేవుని కడప, అమీన్ పీర్ దర్గా, పుష్పగిరి పీఠం, గండి, అత్తిరాల, నందలూరు వంటి క్షేత్రాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. అలాగే గండికోట, సిద్ధవటం కోట వంటి చారిత్రక కట్టడాలు జిల్లాకు వైభవాన్ని చాటుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న ఖనిజ వనరుల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. కడప జిల్లాలో యురేనియం, మంగంపేట బైరైటీస్, సున్నపురాయి, గ్రానైట్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉందని, ఇవి పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని పీవీఎన్ మాధవ్ చెప్పారు. ఈ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థిక స్థితి మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.













