కడప జిల్లాలో పులుల గణన పూర్తి

సిద్దవటం: కడప జిల్లాలోని లంకమల, నల్లమల, పెనుశిల, శేషాచలం అభయారణ్యాల్లో విస్తారమైన అడవి ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 2,98,065 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉండగా, వీటిలో సాధారణ వన్యప్రాణులతో పాటు అరుదైన జంతువులు కూడా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా అడవులకు రారాజులుగా పేరుగాంచిన పులులు, చిరుతలు ఈ ప్రాంతాల్లో విస్తారంగా కనిపిస్తున్నాయి.

జాతీయ పులుల గణన–2025–26 కార్యక్రమంలో భాగంగా ఫేజ్‌–1 కింద గత ఏడాది డిసెంబరులో జిల్లాలో గణన ప్రారంభించారు. ఈ దశలో మాంసాహార వన్యప్రాణులపై ప్రత్యక్ష పద్ధతిలో అటవీ సిబ్బంది సర్వే నిర్వహించారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువులను లెక్కించారు. అలాగే పరోక్ష పద్ధతిలో జంతువుల పాదముద్రలు, పెంట, చెట్లపై గాట్లు, ఇతర ఆనవాళ్లను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు.

ఫేజ్‌–2 కింద శాఖాహార జంతువులపై సర్వే చేపట్టారు. ఈ రెండు దశల అనంతరం ఫేజ్‌–3 కింద పులుల గణనను మరింత సాంకేతిక పద్ధతిలో కొనసాగించారు.

ఫేజ్‌–3లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జిల్లాలో పులుల గణన ప్రారంభమైంది. ముద్దనూరు, వేంపల్లి రేంజ్‌లను మినహాయించి కడప, సిద్దవటం, ఒంటిమిట్ట, బద్వేలు, ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల రేంజ్‌ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 130 ప్రదేశాలను ఎంపిక చేసి, అక్కడ 260 అధునాతమైన సాంకేతిక కెమెరాలను అమర్చారు.

పులుల గణనను 40 రోజులపాటు రెండు విడతలుగా కొనసాగించారు. మొదటి 20 రోజుల అనంతరం కెమెరాల్లో నిక్షిప్తమైన చిత్రాలను సేకరించి, అదే కెమెరాలను మళ్లీ అదే ప్రదేశాల్లో అమర్చి మరో 20 రోజులపాటు గణన కొనసాగించారు. మే 30తో 40 రోజుల గడువు పూర్తికావడంతో ఫేజ్‌–3 కింద పులుల గణన ప్రక్రియ ముగిసింది.

అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫేజ్‌–3లో సేకరించిన డేటాను ఇప్పుడు విశ్లేషణ కోసం శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ బయోల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నిపుణులు కెమెరాల్లో నిక్షిప్తమైన చిత్రాలను పరిశీలించి, పులుల శరీరంపై ఉన్న చారల నమూనాలను ఆధారంగా తీసుకుని జిల్లాలో ఎన్ని పులులు ఉన్నాయో ఖరారు చేయనున్నారు. ఈ విశ్లేషణ పూర్తయ్యాకే కడప జిల్లాలో పులుల ఖచ్చిత సంఖ్య అధికారికంగా వెల్లడికానుంది.