రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
కడప ఫోక్సో కోర్టు తీర్పు
మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో నిందితుడికి కడప ఫోక్సో కోర్టు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కూడా కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం, కడప సిటీలోని జియాన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆవరణలో నివాసముంటున్న కొప్పేర్ల రోడా మెర్సీ కుమార్తె అయిన మైనర్ బాలికపై, అదే విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్న వడిషా వెంకటేశ్వర్లు (42, తండ్రి: కేశవయ్య, నివాసం: నాగరాజుపేట, కడప) కన్నేశాడు.
2023 ఏప్రిల్ 7న సాయంత్రం 4.30 గంటల సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయాన్ని గమనించిన నిందితుడు, నివాస ప్రాంగణంలోని వర్కర్ల గది వద్దకు బాలికను మాట్లాడాలని పిలిచాడు. అక్కడ ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకుని బాలికను బలవంతంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, ఆ వీడియోను చూపిస్తూ బాలికను అప్పుడప్పుడు బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేయగా, ఆమె కడప I-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా అప్పటి కడప I-టౌన్ సీఐ N.V. నాగరాజు కేసు (Crime No.139/2023 U/Sec 354(D) IPC & Sec 7 R/w 8, 11 R/w 12 of POCSO Act) నమోదు చేశారు.
తదుపరి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన కడప రాజశ్రీ POCSO కోర్టు న్యాయమూర్తి M.A. సోమశేఖర్, నిందితుడిపై నేరం రుజువైందని తేల్చి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ K. వేణుగోపాల్, అలాగే సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచి, కేసు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సెల్ ASI నాగేంద్ర, PC చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఐ V. చిన్న పెద్దయ్యలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం.













