రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రష్మిక–విజయ్ దేవరకొండ ‘రణబాలి’ షూటింగ్ 90 శాతం పూర్తి
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత హ్యాట్రిక్ హిట్ ఖాయమనే ఆశలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో 90 శాతం పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. సుమారు 100 రోజుల భారీ షూటింగ్ షెడ్యూల్‌ను టీమ్ విజయవంతంగా ముగించింది.
ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక స్థలం గండికోట కోట పరిసరాల్లో వారం రోజులపాటు ప్రత్యేక షెడ్యూల్ నిర్వహించారు. అక్కడి సహజ సౌందర్యం, కోట ప్రాంతంలోని విభిన్న లొకేషన్లలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్, రొమాంటిక్ సీన్లను అక్కడ పిక్చరైజ్ చేసినట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌తో కలిపి మొత్తం షూటింగ్‌లో దాదాపు 90 శాతం పూర్తి కాగా, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో పాటు నిర్మాతలు సంతృప్తిగా ఉన్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
కథ పరంగా చూస్తే ‘రణబాలి’ సాధారణ కమర్షియల్ సినిమా కాదని, 19వ శతాబ్దం (1854–1878) కాలంలో బ్రిటీష్ పాలన నేపథ్యంలో జరిగిన కొన్ని యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రణబాలి’ గ్లింప్స్‌కు విశేష స్పందన లభించింది. గుర్రపు స్వారీ చేస్తూ, కత్తులతో శత్రువులను తరిమికొట్టే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత సినిమా స్థాయి, స్కేల్‌పై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
భారీ బడ్జెట్‌తో, విస్తృత స్థాయిలో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసే దిశగా యూనిట్ కసరత్తు చేస్తోంది.













