రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దళాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రెడ్ సాండర్స్ అంటి - స్మగ్గ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) బృందం, స్టేట్ ఇంటలిజెన్స్ టీమ్స్ సహకారంతో కడప జిల్లా అవధూత కాసినాయన మండలం జ్యోతిగుడి–వరికుంట్ల గ్రామాల సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల సమయంలో గృహోపకరణాలు తరలిస్తున్నట్లు చూపిస్తూ ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న బొలెరో మ్యాక్సీ ట్రక్ (Container) ను పోలీసులు ఆపి పరిశీలించారు. వాహనంలో ఎర్రచందనం దుంగలు దాచినట్లు గుర్తించిన అధికారులు, హర్యానా రాష్ట్రానికి చెందిన సన్నీ , రమేష్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
వాహనంలో మొత్తం 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎర్రచందనం రవాణాకు ఉపయోగించిన బొలెరో మ్యాక్సీ ట్రక్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
దర్యాప్తు ప్రక్రియలో జ్యోతి ఫారెస్ట్ బీట్ లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మల్లికార్జున ఈ స్మగ్లర్లకు సహకరించినట్లు బయటపడింది. దీంతో అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసులో నిందితుడిగా చేర్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్ సాండర్స్ అంటి - స్మగ్గ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) ఈ ఆపరేషన్ ద్వారా అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను భంగం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. టాస్క్ ఫోర్స్ , స్టేట్ ఇంటలిజెన్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేసినందువల్లే ఈ పెద్ద పట్టివేత సాధ్యమైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (DGP) శ్రీ హరీష్ కుమార్ గుప్త , IPS అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా పై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి స్మగ్లింగ్ ప్రయత్నాలను ముందస్తుగా గుర్తించి అడ్డుకునేందుకు ప్రత్యేక దళాలు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.













